పవన్ కళ్యాణ్‌కు పరీక్ష!
నాగబాబుకు బెర్త్ దక్కుతుందా?
ఊరిస్తున్న మంత్రి పదవి..
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ సీఎం
5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
మార్చి 3న నోటిఫికేషన్
అన్నీ కూటమి పరమే!
సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయ్.. ఐదు స్థానాలతో మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ రానుండటంతో మరోసారి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రి పదవి ప్రస్తావన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నాగబాబు చట్టసభల్లో లేనందున ఆయన మంత్రి కావాలంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యం. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అది నాగబాబుకు కలిసి వచ్చిన అదృష్టంగా భావించవచ్చు. అంతకుముందు నాగబాబును రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం వచ్చింది. రాజ్యసభ స్థానాల భర్తీలో తుదకు నాగబాబు పేరు లేకపోవడం, జనసేన శ్రేణుల నుంచి నిరసనలు రావడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనసేన అభిమానులకు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో సంతోషంగా ఉన్నారు. నాగబాబును ఎమ్మెల్సీగా చేసి, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేయించడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పెద్ద పరీక్షగా మారింది. ఖాళీ అయిన స్థానాల్లో టీడీపీకి చెందిన పరుచూరి అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు ఉన్నారు. ఈ ఐదు స్థానాల్లో టీడీపీ 3, జనసేన, బీజేపీ, చెరొకటి తీసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ కోటాకు భారీగా నేతలు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపాటుకు గురైన వారు, టిక్కెట్లు కోల్పోయిన వారికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఎలాగైనా టీడీపీకి 4 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. మధ్యలో బీజేపీ కూడా ఎమ్మెల్సీ స్థానం ఆశించడంతో ఇక టీడీపీకి 3 ఖాయమని తెలుస్తోంది. జనసేనకు ఒక సీటు కేటాయిస్తే, అది తప్పనిసరిగా నాగబాబుకు ఇస్తారన్న ప్రచారముంది. జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేల ద్వారా నాగబాబు ఎన్నికయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు విన్పిస్తోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రులు నెట్టెం రాఘురామ్, దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ పడుతున్నారు. వారితోపాటు ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోయిన వారిలో కొందరికి తిరిగి ఇచ్చే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
శాసన మండలిలో పెరగనున్న కూటమి బలం
వరుసగా వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో క్రమేపీ శాసన మండలిలో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పార్టీల బలం పెరుగుతోంది. ప్రస్తుతం ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పరం కానున్నాయి. కూటమి పార్టీ అభ్యర్థులకు 164 ఎమ్మెల్యేలున్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కూటమికి చెందిన ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ సంఖ్యతో శాసన మండలిలో కూటమి ఎమ్మెల్సీల సంఖ్య అధికమవుతుంది.. వాటితో తోడుగా ఇటీవల ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ మూడు కూటమి వశమైతే మరింత బలం పెరగనుంది. ప్రస్తుతం శాసన మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీల సంఖ్యా బలం మెజార్టీగా ఉండటంతో కూటమికి తలనొప్పిగా ఉంది. సూపర్ సిక్స్, సంక్షేమ హామీలపై ప్రభుత్వాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు నిలదీయడంతో కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ఇరకాటంలో పడుతున్నారు. దీని గుర్తించిన కూటమి ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్సీ స్థానాన్ని తన కోటాలో పడేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. సమర్థులకు, అనువభజ్ఞలకు టిక్కెట్లు ఇచ్చి పార్టీలో తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి మాజీ మంత్రులు నెట్టెం రఘురామ్, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాల నుంచి యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్‌బాబుకు తిరిగి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారన్న ప్రచారం ఉంది. మంత్రి నారా లోకేష్ మాత్రం యువకులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలిలా..
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీల ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఫిబ్రవరి 27వ తేదీన 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కటి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, కృష్ణా`గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఈ ఐదు స్థానాలకు కలిపి మార్చి 3న నోటిఫికేషన్ జారీ జేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మార్చి 10. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఇవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ తమ వాటా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ దిశగా పార్టీలో సీనియర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే జనసేనకు ఒక ఎమ్మెల్సీ సీటు ఉన్నందున మరోసీటు వస్తే శాసన మండలిలో ఆ పార్టీ బలం 2కు చేరుతుంది. బీజేపీకి కనీసం ఒక్క ఎమ్మెల్సీ సీటు లేకపోవడంతో ఎలాగైనా ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి ఖాతాలకే వెళ్లడంతో వైఎస్‌ఆర్‌సీకి రాబోయే రోజుల్లో మండలిలో గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం మండలిలో వైసీపీ పట్టు ఉంది. ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిలో వైసీపీ నేతలు తమ వాదనను గట్టిగా విన్పించిన విషయం విదితమే. అందుకే మండలి ఎన్నికలు ఈ పార్టీలకు కీలకం కానున్నాయి. (Story: పవన్ కళ్యాణ్‌కు పరీక్ష!)
Follow the Stories:
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!