వైఎస్ఆర్సీపీలో అలజడి
తెరపైకి కొడాలి నాని పేరు?
శుక్రవారం గండం!
వంశీ అరెస్టుతో కలవరం
రెడ్‌బుక్ ఓపెన్‌తో పత్తాలేని నేతలు
సొంత నియోజకవర్గం, క్యాడర్‌కు దూరం
న్యూస్ తెలుగు/అమరావతి: శుక్రవారం వచ్చిందంటే చాలు.. వైఎస్‌ఆర్‌సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రధానంగా అక్రమ కేసులతో ఉన్న ఆ పార్టీ నేతలంతా పత్తా లేకుండా పోయారు. రెడ్‌బుక్ ఓపెన్‌తో సొంత నియోజకవర్గాన్ని, నమ్మిన కార్యకర్తలను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు అరెస్టయిన వారంతా ఎక్కువగా శుక్రవారం గానీ, గురువారం అర్థరాత్రిగానీ ముహూర్తం ఉంటోంది. ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు కావడం, బెయిల్‌కు అడ్డంకులు ఎదురవ్వడం, తప్పనిసరిగా జైలు గడపలు తొక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలోనూ చాలా మంది టీడీపీ నేతలు శుక్రవారం అరెస్టులకు గురయ్యారు. అప్పట్లో శుక్రవారం వచ్చిందంటే చాలు..ఎవరిపైన టార్గెట్ అనేదీ ఆసక్తిగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో దూకుడుగా వ్యవహరించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మౌనం దాల్చారు. కనీసం నియోజకవర్గాల్లోనూ ధైర్యంగా తిరగలేని పరిస్థితి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), వల్లభనేని వంశీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మచిలీపట్నంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటలకే..పరిస్థితి తెలుసుకుని వారు బయటకు వచ్చేశారు. కొడాలి నాని, వంశీదీ.. ఉక్కు బంధం. కొంతకాలం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ..ఆ బంధం వీడలేదు. గన్నవరం నుంచి వంశీ రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ నుంచి గెలిచాక..వైఎస్‌ఆర్‌సీపీకి వంశీ దగ్గరయ్యారు. ఇందులో కొడాలి నాని పాత్ర కీలకంగా నిలిచింది. వంశీ అరెస్టు అనంతరం కొడాలి నాని పేరు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. మిగిలిన వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లోనూ కలవరం మొదలైంది. ఒక వైపు రెడ్‌బుక్ అమలులో ఉందంటూ వస్తున్న లీక్‌లతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల సొంత నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు. కొందరైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్న పరిస్థితులుండటం గమనార్హం.
కేరాఫ్ హైదరాబాద్‌గా వంశీ, నాని
ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ, కొడాలి నాని హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అతిగా వ్యాఖ్యలు చేయడం, దూకుడుగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న ప్రచారముంది. దాన్ని గమనించిన వారిద్దరూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మౌనం దాల్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో జరుగుతున్న భేటీలకు హాజరు కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వంశీ అరెస్ట్ అవుతారన్న ప్రచారం ఉంది. కొన్ని కేసులకు వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకుని ..కాలయాపన చేస్తుండగా..మరో కొత్త కేసుతో ఊహించని విధంగా అరెస్టు అయ్యారు. వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారన్న ప్రచారముంది. నాడు చంద్రబాబు, లోకేశ్, టీడీపీ మీద వైసీపీ నేతలంతా చేసిన విమర్శలు ఒక ఎత్తైతే..కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు అంతకంటే ఎక్కువుగా ఉన్నాయి. నిత్యం వంశీ, కొడాలి నాని మాటలు రాజకీయంగా చర్చానీయాంశమయ్యేవి. చంద్రబాబును, లోకేష్‌ను ఇరుకున పెట్టేలా ఉండేవి. ఆనాడు టీడీపీకి అధికారం లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడటం, వంశీ, కొడాలి నాని ఓటమి పాలవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
కొడాలి నానిపై కేసులు?
కొడాలి నానిపై అనేక కేసుల్లో ఆరోపణలున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారంటూ విశాఖలో ఓ యువతి కొడాలి నానిపై ఫిర్యాదు చేసింది. అనంతరం గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల వ్యవహారం తెరపైకి వచ్చింది. వంశీ అరెస్టుతో ఆగని పోలీసులు ఇకపై కొడాలి నానినే తమ టార్గెట్ అని చెపుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా సైతం కోడై కూస్తోంది. నాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్ గట్టిగా పట్టుబడుతూ వస్తోంది. దీంతో కొడాలి నానిపైనా రెడ్‌బుక్ దూసుకుపోతుందా?, లేదా? అనేదీ రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. వీరిద్దరి అనుచరుల్లో కొందరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఒక్క కొడాలి నానినే కాదు. మిగిలిన వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల్లోను శుక్రవారం వస్తుందంటే..చాలు కలవరం మొదలవుతోంది. ఏ సమయంలో..ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన షురువైంది. (Story: శుక్రవారం గండం!)
Follow the Stories:
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?