జగన్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి కౌంటర్
ఎక్స్‌వేదికగా ఘాటు వ్యాఖ్యలు
అదే బాటలో మోపిదేవి వెంకటరమణ
వైసీపీకి ఇంటా, బయటా పోరు
విమర్శనాస్త్రాలతో పార్టీ కేడర్ సతమతం
న్యూస్ తెలుగు/అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇంటా, బయటా విమర్శల అస్త్రాలు, కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తల్లి విజయమ్మ, చెల్లె షర్మిల పార్టీకి దూరంగా ఉండటమూ పెద్దలోటుగానే మారింది. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లోనూ కన్పించింది. ఇటీవల పార్టీలో నంబరు-2గా చెలామణి అయిన వి.విజయసాయిరెడ్డి రాజ్యసభకు, పార్టీ పదవులకు రాజీనామా చేయడం చర్చానీయాంశంగా మారింది. ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బగానే ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నప్పటికీ, పైకి మాత్రం పెదవి విప్పడంలేదు. ఈనెల 6వ తేదీ గురువారం తన క్యాంపు కార్యాలయంలో వెఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి..తాజా రాజకీయ పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. తాను మీడియాకు చెప్పదలచుకున్న అంశాల తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. అందులో ఇటీవల పార్టీని వీడిన విజయసాయిరెడ్డి ప్రస్తావనా వచ్చింది. ఆయన బాటలోనే మరికొందరు రాజ్యసభకు రాజీనామా చేస్తారట కదా? అనే ప్రశ్నకు జగన్ బదులిచ్చారు. ‘పార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి కావచ్చు..వెళ్లిపోయిన ఇతర నేతలు కావచ్చు, వెళ్లబోయే వాళ్లు కావచ్చు, ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని జగన్ స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్‌గా ఉంటాయని, వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని వైఎస్ జగన్ అన్నారు. ప్రత్యర్థి పార్టీల బెదరింపులకు భయపడి వెళ్లిపోయిన వాళ్లను జనం పట్టించుకోరని, ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఓపిక అవసరమని, పార్టీలు మారే వారికి గౌరవం, విశ్వసనీయత ఉండదని అన్నారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని జగన్ సూచించారు. తాను దేవుడి దయను, ప్రజల దీవెనను నమ్ముకున్నానని జగన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించినవే. అటు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తాజాగా ఎక్స్‌వేదికగా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎక్కడా జగన్ పేరెత్తకుండానే చెప్పాల్సింది సూటిగా చెప్పేశారు.
భయం అనేదీ తన అనువు..అనువులో లేదు: విజయసాయిరెడ్డి
‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు.. విజయసాయిరెడ్డి. భయం అనేది తనలో ఏ అణువు అణువులోను లేదు..కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నానని’ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి కౌంటర్ వైసీపీలో అలజడిని సృష్టిస్తున్నాయి. వైసీపీకి రాజ్యసభలో 11 సభ్యులతో బలం ఉండగా..వరుసగా నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 7కు చేరింది. మరో ఒకరిద్దరు రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా రాజ్యసభలో వైసీపీ బలం తరిగిపోతోంది. అటు వైసీపీ నుంచి ఒక్కొక్క కీలక నేతల చేజారి పోవడంతో ఆ పార్టీ ఎప్పటికప్పుడూ బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇటీవల రాజీనామా చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి..ఏకంగా జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేదీ చర్చానీయాంశమైంది. ఏపీలో కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోతుంది. ఇప్పటికే మూడు విడతలుగా సమావేశం అయింది. తొలిసారి సమావేశాలు జరిగినపుడు సభ్యులు అంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక విజయసాయిరెడ్డి బాటలోనే ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. నా మనస్తత్వం, వ్యక్తిత్వం తెరచిన పుస్తకం లాంటిదని, ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగిపోయే వాడినికాదని చెప్పారు. నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మైళ్లు రాళ్లు, ఎన్నెన్నో ఒడిదుగులు ఎదుర్కొన్నానని మోపిదేవి పేర్కొన్నారు. అవకాశవాదానికి, పదవులకు, ఒత్తిళ్లకు లొంగిపోయేవాడిని కాదని మోపిదేవి ఆ ట్వీట్‌లో జగన్‌కు బదులిచ్చారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలపై జగన్ కన్ను
కాంగ్రెస్‌లోని కొందరు కీలక నేతలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. నిత్యం విమర్శలతో వైసీపీని, జగన్‌ను ఎక్కుపెడుతున్న షర్మిలకు గట్టి షాక్ ఇచ్చే దిశగా జగన్ పయనమైనట్లు తెలిసింది. ఆ దిశగా కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలూ, అదీ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సాన్నిహిత్యం కలిగిన వారిని ఏరిమరీ పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామంతో అసలే మైనస్‌లో ఉన్న కాంగ్రెస్‌కు నష్టమే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శైలజానాథ్ గతంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. రెండు విడతలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగాను పనిచేశారు. ఇదే బాటలో అనంతపురంజిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘునాథ్‌రెడ్డి ఉన్నట్లుగా ప్రచారముంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి పేరూ విన్పిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎంపీలు..వైసీపీలోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానించి, ఆ దిశగా వారితోనే షర్మిల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లు ఇచ్చే వ్యూహంతో జగన్ రాజకీయ క్రీడ ప్రారంభించినట్లుగా ప్రచారముంది. ఏదేమైనప్పటికీ, వైసీపీకి ఇంటా బయటా ఎదురవుతున్న సవాళ్లను అధినేత జగన్ ఏ మేరకు ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే! (Story: వైసీపీకి ఇంటా, బయటా పోరు)
Follow the Stories:
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?