చిత్తూరు రాజకీయాలకు బలికానున్న సినీతార
రోజాకు జగన్ చెక్?
వైఎస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు?
గాలి జగదీష్ చేరికకు రంగం సిద్ధం
చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
రోజా రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం
ఇదే జరిగితే వైసీపీ, టీడీపీకి షాక్‌లే..!
న్యూస్‌తెలుగు/అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)లో ప్రక్షాళన మొదలు అయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఒక వైపు ఖాళీ అయిన నియోజకవర్గాల్లో కొత్త వారితో ఇన్‌చార్జిలను భర్తీ చేస్తూ, మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు వైసీపీ కండువా వేసుకోనున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వైఎస్ఆర్ సీపీలోకి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు..చిన్న కుమారుడు గాలి జగదీష్ చేరనున్నారని సమాచారం. ఈ పరిణామం టీడీపీతోపాటు మాజీ మంత్రి ఆర్కే రోజాకు భారీ షాక్ తగలనుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అతడి చేరిక ఉండనుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశమైంది. అదే తరహాలో ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి..వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి తర్వాత ఉన్న కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి..టీడీపీ, జనసేనలోకి చేరారు. మరికొందరు తటస్థంగా, మౌనంగా ఉండిపోయారు. రాజ్యసభ సభ్యులూ నలుగురు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అందులో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి..తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ వైసీపీకి వరుసగా షాక్‌లకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన కొన్ని చర్యలపై అందరి దృష్టి పడింది.
గతంలో చేసిన తప్పిదాలను జగన్ గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారా?, సొంత నియోజకవర్గాల్లో అసమ్మతి ఎదుర్కొంటున్న నేతలకు చెక్ పెట్టాలనుకుంటున్నారా?, లేదా ఇంకేమైనా జరగబోతున్నదా? ఏదైతేనేమీ జగన్ ఆలోచనలు అంతుపట్టుడంలేదు. నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి రోజా ఇంటిపోరును ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆమెకు వద్దంటూ సొంత నేతలే తిరుగుబావుటా ఎగురేశారు. ఏకంగా అప్పటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆమెపై ఫిర్యాదులు చేశారు. అప్పట్లో నగరి నియోజకవర్గ నేతలందర్నీ జగన్ పిలిపించి సర్దిచెప్పారు. రోజాకే నగరి అసెంబ్లీ సీటును ఖరారు చేశారు. అనంతరం ఎన్నికల్లో రోజా చిత్తుగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కొన్ని నెలలపాటు పార్టీలో కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనలేదు. ఇటీవల నుంచి మళ్లీ తెరపైకి వచ్చి..పవన్‌పైన ట్వీట్లు పెడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా రోజాకు చెక్‌చెప్పే పనిలో ఉన్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏవో పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న ప్రచారం సాగుతోంది.
రోజా, పెద్దిరెడ్డి మధ్య విభేదాలు?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ది, రోజా మధ్య కొంతకాలంగా రాజకీయ విభేదాలు నడుస్తున్నాయి. తన పలుకుబడి కొనసాగేలా పెద్దిరెడ్డి సరికొత్త వ్యూహం నడిపిస్తున్నట్లు ప్రచారముంది. గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డితో ఆమెకు పొసగలేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అనే తీరున రాజకీయాలు కొనసాగాయి. రోజా ఎమ్మెల్యేగా ఓడిపోవడం వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఉందన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఓడిపోయిన రోజాను నగరి నియోజకవర్గం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే గాలి జగదీశ్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతారని సమాచారం. ఆయనతోపాటు చిత్తూరుజిల్లాకు చెందిన నేతలు వైఎస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరనున్నట్లు తెలిసింది. ఈ సమయంలో, అందులోనూ టీడీపీ కూటమి పూర్తి మెజార్టీ ఉన్న తరుణంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు..గాలి జగదీశ్ వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరితే కచ్చితంగా అది సంచలనమే అవుతుంది. ఈయన నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌కు జగదీశ్ సోదరుడు కావడం గమనార్హం. తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జగదీశ్ చేరికకు సిద్ధమైనట్లు సమాచారం. అదే జరిగితే మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు చెక్ పెట్టేందుకు నగరి నియోజకవర్గంలో గాలి జగదీశ్‌ను చేర్చుకుంటున్నారన్న ప్రచారం ఉంది. రోజాను నియంత్రించడం కోసమే ఈ తరహాలో జగదీశ్‌ను తెరపైకి పెద్దిరెడ్డి తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారు.
రోజాకు పొమ్మనలేక పొగ పెడుతున్నారా?
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రోజాను పొమ్మనలేకే పొగ పెడుతున్నారా? అనే వార్తలు వస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నగరి నియోజకవర్గంలో రోజా అనుచరులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ప్రచారముంది. ప్రధానంగా రోజా సోదరుల నేతృత్వంలోనే ఇదంతా కొనసాగినట్లుగా సొంత కార్యకర్తలే పార్టీ అధినేత జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విధానాలతో స్థానికంగా పార్టీకి కొంత నష్టం జరిగినట్లుగా నేతలు అంచనా వేస్తున్నారు. నగరి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరపున రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక..రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆమెకు అవకాశం దక్కింది. అప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో రోజా ఆధిపత్యం పెరిగింది. ఇది మిండుగుపడలేని పెద్దిరెడ్డి అనుచరగణం రోజా అనుచరుల అవినీతి పేరుతో ఆమెకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా కథనాలు వస్తున్నాయి. రోజా రాజకీయ భవిష్యత్ ఏమిటి?, ఆమెను నగర వైసీపీ ఇన్‌చార్జిగా కొనసాగిస్తారా?, ఇతర నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగిస్తారా? అనేదీ వైసీపీ శ్రేణులకు అంతుచిక్కడంలేదు. ఏదేమైనప్పటికీ, రోజాకు చెక్ చెప్పడం తప్పదని అమరావతిలోని వైసీపీ వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. (Story: రోజాకు జగన్ చెక్?)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?