కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
క్యూ ఆర్ కోడ్‌తో ముద్రణ
మార్చి నుంచి పంపిణీ ?
పేద ప్రజలకు శుభవార్త
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు
న్యూస్ తెలుగు/అమరావతి: రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డులు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అధికారంలోకి వచ్చిన 9 నెలల నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం అర్హులైన నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. అవి లేకపోవడంతో పెన్షన్‌కు నెలల తరబడి దూరమవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలకు తెల్లకార్డులు ఉంటేనే అర్హులవుతారు. అలా తెల్లకార్డులేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చిలో ఈ ప్రక్రియను శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే దీనిపై పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. ఒక్క తెల్లకార్డులే కాకుండా పాత కార్డుల్లోను మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా కొత్త తెల్లకార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా మహిళలకు కూటమి ప్రభుత్వం అందించబోయే సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకుగాను సీఎం చంద్రబాబు నేతృత్వంలో కొత్త తెల్లకార్డులు ఇవ్వనున్నారు. మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలెండర్లు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 93.42లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 1.50 కోట్లు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, 18 నెలలు దాటిన మహిళకు ప్రతినెలా 1500, ప్రతినెలా నిరుద్యోగ భృతి రూ.3వేలు తదితర పథకాలు రావాలంటే..తెల్లరేషన్ కార్డు గల వారినే అర్హులుగా చూస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగానే దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి..విధి విధానాలను జారీజేస్తారని సమాచారం.
కొత్త డిజైన్లు, రాజముద్రతో తెల్లరేషన్ కార్డులు
చంద్రబాబు ప్రభుత్వం జారీజేయబోయే తెల్లరేషన్ కార్డులు కొత్త డిజైన్లతోపాటు వాటిపై రాజముద్ర ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని టీడీపీ కూటమి అప్పట్లో హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ మొదలెట్టనుంది. మార్చి నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వారిలో అర్హులైన వారికి కార్డులు అందజేస్తారు. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి కూడా కొత్తగా బియ్యం కార్డులు అందనున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 1.50 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఇప్పుడున్న రైస్ కార్డులు ఎక్కడా ఓపెన్ కాకుండా చేసిందని, అందుకే పాత కార్డులు తొలగించి కొత్త కార్డులు జారీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే పౌర సరఫరాలశాఖ అధికారులు వెంటనే కార్యాచరణలోకి వెళ్తారు. ఇప్పటికే అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టారు. అటు కార్డు దారుల్లో అనర్హులుంటే వారిని తొలగించే కార్యక్రమాన్ని కూడా చేపడతారు.
కొత్త రేషన్ కార్డుల కోసం కావాల్సినవి ఇవీ..
కుటుంబ సభ్యుల ఫోటో (4/6) పరిమాణంలో వెనుకవైపు వైట్ లేదా క్రీమ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉండాలి. కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్స్ అవసరమౌతాయి. కుటుంబ యజమాని మ్యారేజ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం కొత్తది తీసుకోవాలి. ఆధార్-పాన్ కార్డు లింక్డ్ బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ ప్రతులు సిద్ధంగా ఉంచుకోవాలి. రేషన్ కార్డుల కోసం నోటిఫికేషన్ వెలువడగానే ఈ వివరాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. కొత్తగా కార్డులు పొందిన వారంతా..కార్డుల్లో ఉండే క్యూఆర్ కోడ్ కీలకం. అది చెరిగిపోకుండా జాగ్రత్తగా కార్డును చూసుకోవాలి. రేషన్ షాపుకి వెళ్లాక, ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తారు. ఆ సమయంలో లబ్దిదారుడి వివరాలు.. రేషన్ డీలర్ ట్యాబ్లెట్‌లో కనిపిస్తాయి. ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చి, అప్‌డేట్ చేస్తారు. ఇలా ప్రతీ నెలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సరుకులు ఇస్తారు. మొత్తంగా మార్చిలో కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి. ప్రజల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా తెల్ల రేషన్ కార్డులు అందజేస్తారు. ఈ జారీలో ఏ అధికారికిగాని ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు వస్తాయి. ఇక గతంలో పాత కార్డులు కలిగిన వారికీ..వాటి స్థానంలో కొత్తకార్డులు మంజూరు చేస్తారు. సమీప గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. (Story: కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!)
Follow the Stories:
జగన్..జస్ట్ ఫైవ్ మినిట్స్! అలా వచ్చి..ఇలా వెళ్లి..!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?