ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
అమరావతి: ఇక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్వ్యూలతో నిమిత్తం లేకుండానే ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) నిర్వహించాల్సిందేనంటూ ఏపీపీఎస్సీ సభ్యులు, కార్యదర్శి గట్టిగా పట్టుబట్టినా ప్రభుత్వం అంగీకరించలేదని ప్రధాన పత్రికల్లో కథనాలు వెలువడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని అధికారవర్గాలు ధృవీకరించాయి. మౌఖిక పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టంగా చెపుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాకపోతే ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాల భర్తీ జరగడం సరైన విధానమా కాదా అన్న అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విచిత్రమేమిటంటే, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నామినేట్ చేసిన ఏపీపీఎస్‌సీ సభ్యుల వాదన మాత్రం… ఉద్యోగాలివ్వాలంటే కచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సిందేనని వారంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని 2021 జూన్ 26న సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కొన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగాయి. తాజాగా ఈ నెల 21న ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖకు లేఖ రాసి ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించాలని బోర్డు సభ్యులతోపాటు కొందరు పౌరులు విన్నవించారని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి స్పందనగా సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి మార్చి 28న ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. అందులో ‘’ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలంపాటు ఇంటర్వ్యూలు వద్దు. కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో నియమితులయ్యే వారి కోసం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల పద్ధతులను పరిశీలించిన తర్వాతే రద్దు ఉత్తర్వులిచ్చాం. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో పక్షపాత ధోరణి లేకుండా చూడటం పెద్ద సవాల్‌గా ఉండటం, బయటి వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రించలేకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాకే ఇంటర్వ్యూలు ఉండకూదని నిర్ణయించింది’ అని ఆ వర్తమానంలో పేర్కొన్నారు. దీంతో ఏపీపీఎస్‌సీ సభ్యులు కొంతమేరకు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఇంటర్వ్యూలు లేకుండా సరైన అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Story: ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!)
See Also: వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)