UA-35385725-1 UA-35385725-1

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

RRR చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రణం, రుధిరం), విడుదల: 25-03-2022. నటీనటులు: ఎన్టీయార్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan), అజయ్‌దేవ్‌గణ్‌, ఆలియాభట్‌, ఒలీవియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, రే స్టీవెన్సన్‌, శ్రీయ తదితరులు. సంగీతం: ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాత: డీవీవీ దానయ్య, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli), బ్యానర్‌: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌.

నీరు, నిప్పును సమాంతరంగా నడిపి ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి భారత సినీ ప్రేమికులు మరోసారి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీయార్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)(రౌద్రం, రణం, రుధిరం) సినిమా శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డుస్థాయి అంచనాలతో మన ముందుకొచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమయ్యే అవకాశాలు అసలేలేవు. కాకపోతే హిట్టయిందా లేదా యావ్‌రేజ్‌గా నిలిచిందా? కోట్లు కుమ్మరించిన ఈ సినిమా బాహుబలి వంటి మరో అద్భుతాన్ని సృష్టించిందా? ఓసారి సమీక్ష చేద్దాం.
స్టార్‌ హీరో సినిమా అంటేనే ధియేటర్లు బద్దలైపోతాయి. అలాంటిది ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకేసారి వచ్చారంటే ఇంకేమైనా వుందా? పైగా భారత్‌ గర్వించదగ్గ ఒక గొప్ప దర్శకుడి సినిమా అంటే ఆ రేంజి ఎలా వుంటుందో మీరే ఊహించండి! నిజంగానే ప్రేక్షకులు ఊహించిన రేంజికి తగ్గట్టుగానే మూవీ ఆసక్తిని రేపుతూ వచ్చింది. కె.వి.విజయేంద్రప్రసాద్‌ కథకు, ఊపరిసలపని రాజమౌళి కథనం, వాటికి కూలీల్లా కష్టపడిన నటీనటుల శక్తి, సెంథిల్‌ నాణ్యమైన సినిమాటోగ్రఫీ, ఉరకలెత్తించే కీరవాణి సంగీతం, రోట్టెముక్కలు తెగిపడినట్లుగా సాయి మాధవ్‌ సంభాషణలు, కళ్లముందు రాజమౌళి కలను సరైనరీతిలో ఆవిష్కరింపజేసిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు తీసుకుపోయాయి. ఒక తిరుగులేని విజువల్‌ వండర్‌ను కళ్ల ముందు సృష్టించారు.

కథేమిటంటే?

చూడటానికి కథ చాలా సాధారణంగా ఉన్నట్టే అన్పిస్తుంది. అయితే రవి అస్తమించని బ్రిటిష్‌వారి పాలనాకాలంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు గొప్ప పోరాటయోధులుగా నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే వారిద్దరూ ఏకకాలంలో ఉండి, బ్రిటిష్‌వారిని ఎదిరిస్తే పరిస్థితి ఎలా వుంటుంది? అనే ఒక ఊహాజనిత అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని, ఆ పాయింట్‌ చుట్టూ అల్లిన సరికొత్త కథారూపమే ఆర్‌ఆర్‌ఆర్‌. వాస్తవానికి రామ్‌, రామారావు, రాజమౌళిల కలయికగా ఆర్‌ఆర్‌ఆర్‌ అనే డమ్మీ టైటిల్‌తో సినిమా చిత్రీకరణను ప్రారంభించినప్పటికీ, దానికి రౌద్రం, రణం, రుధిరం అనే అంశాలను మిళితం చేసి చివరకు అదే టైటిల్‌ను ఖరారు చేశారు. నిజానికి టైటిల్‌ నుంచే ఈ సినిమా అద్భుతాలు మొదలయ్యాయి. నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైంది. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్‌ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. కానీ గోండు జాతిలో ప్రతి ఆడపిల్లకు ఓ కాపరి ఉంటాడు. ఆ గోండు జాతి కాపరి కొమురం భీంకి(ఎన్టీయార్‌) ఈ విషయం తెలుస్తోంది. కొమురం భీం తమగూడెం పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢల్లీిలో అడుగుపెట్టి అక్కడ విధ్వంసం సృష్టించి ఆ పిల్లను ఎలా రక్షిస్తాడనేదే కథాంశం. దాంతో కొమురం భీం (ఎన్టీఆర్‌)ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను రామరాజు (రామ్‌చరణ్‌)కు అప్పగిస్తోంది బ్రిటీష్‌ ప్రభుత్వం. రామరాజు తన ప్రియురాలు సీతకు ఇచ్చిన మాట ప్రకారం బ్రిటిష్‌ పోలీసు వర్గంలో మంచి పదోన్నతి కోసం నిజాయితీగా పనిచేస్తుంటాడు. అనుకోనిరీతిలో రామరాజుకు భీంతో ఏర్పడిన పరిచయం కథను మలుపు తిప్పుతుంది. రామరాజు కొమురం భీమ్‌లోని నిజాయితీ, మంచితనం నచ్చి అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. ఈ విషయం ఏమి తెలియని భీం అనుకోకుండా సీతను కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది అన్నం తిని ఆకలి తీర్చుకున్న భీం ఆమె కష్టానికి కరిగిపోతాడు. మనువాడిన వాడు ఉరికంభం ఎక్కబోతున్నాడని సీత కన్నీరు పెట్టుకుంటుంది. రామరాజు గురించి భీంకు మొత్తం నిజం తెలుస్తోంది. నీ భర్త రాముడు లాంటి వాడు, రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు అంటూ కొమురం భీం మళ్లీ బ్రిటీష్‌ వారిపై అటాక్‌ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు. ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? బ్రిటిష్‌ ప్రభుత్వంపై భీమ్‌, రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు? ఈలోగానే మిత్రులు శత్రువులుగా ఎలా మారారు? మళ్లీ ఎలా కలుసుకున్నారు? మధ్యలో వచ్చిన ఫ్లాష్‌బ్యాక్‌ (అజయ్‌ దేవగణ్‌, శ్రీయల స్టోరీ) అనేది ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ధియేటర్‌లో చూడాల్సిందే!

ఓ విజువల్‌ వండర్‌!

ఒక గొప్ప సాంకేతిక అద్భుతాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా మనం చూడగలుతాం. ఎన్టీయార్‌ పులితో చేసిన పోరాటం, రామ్‌చరణ్‌తో కలిసి చేసిన పోరాటాలు, వారిద్దరి మధ్య నడిచే ఫైట్‌, వారి ఆవేశాలు, బ్రిటిష్‌వారితో చేసే యుద్ధాలు, ప్రకృతి దృశ్యాలు, నృత్యరీతులు…ఇలా అన్నీ ఒక దృశ్యకావ్యాన్ని చూసినట్లుగా అనుభూతి కలుగుతుంది. కళ్లార్పకుండా చూసేలా రాజమౌళి కథనం నడుస్తుంది. కథలు మేలిమలుపులు ఆసక్తిని రేపుతాయి. ఇద్దరు స్నేహితులు కలిసుంటే ఎంత ఆహ్లాదకరంగా వుంటుందో, అదే ఇద్దరు వైరంతో కలబడితే ఎంత బీభత్సంగా వుంటుందో రాజమౌళి తనదైన అద్భుతమైన శైలితో చూపించారు. ప్రతి ఫ్రేము ఒక విజువల్‌ వండర్‌. ఒక మాయలా కన్పిస్తుంది.
నటన విషయంలో ముందుగా ఎన్టీయార్‌-చరణ్‌ల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీయార్‌, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్‌ గుండె బరువెక్కేలా చేస్తాయి. కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా.. ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఇద్దరు చెరో దారిలో తమ ప్రయాణం సాగించినా.. రెండు పాత్రల మధ్య బాండిరగ్‌ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్‌ చేశాడు. ముఖ్యంగా విరామానికి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇద్దరూ సింహాల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా.. రెండు పాత్రల మధ్య ఎమోషన్‌ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ లో ఆడియెన్స్‌ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం. ఆ విషయంలో ఇద్దరినీ మెచ్చుకోవాలి. అలియా భట్‌ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలీవియా మోరిస్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రీయా అలాగే మిగిలిన లార్జ్‌ స్టార్‌ కాస్ట్‌కి వాళ్ళ రేంజ్‌కి తగ్గ, క్యాలిబర్‌ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫస్ట్‌ హాఫ్‌లో ఎన్టీఆర్‌-చరణ్‌ల ఇంట్రడక్షన్‌ సీక్వెన్స్‌, అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. చరణ్‌-అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కవుట్‌ అయ్యింది. ఓవరాల్‌గా ఇది ఒక యూనిక్‌ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్‌గా సాగే ఈ సినిమా క్లైమాక్స్‌ కూడా వండర్‌గా అనిపిస్తోంది. ఈ క్లైమాక్స్‌ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్‌ను డిజైన్‌ చేయడం నిజంగా గొప్ప విషయమే. క్లైమాక్స్‌ కొందరిని నిరాశపర్చినట్లు తెలిసింది. అయితే ఒకే తరహా పతాక సన్నివేశాలకు అలవాటు పడిన మన ప్రేక్షకుడికి ఇది ఒక విధంగా ట్విస్టే. ఫ్లాష్‌బ్యాక్‌ కేవలం ద్వితీయార్థంలో మాత్రమే వుంటుంది. కాకపోతే ఫ్లాష్‌బ్యాక్‌ దృశ్యాలో సాగదీత కన్పించినప్పటికీ, రాజమౌళి మార్కు దృష్ట్యా అది పెద్దగా సాగదీతలా అన్పించదు. అజయ్‌దేవ్‌గణ్‌, ఒలీవియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, రే స్టీవెన్సన్‌, శ్రీయ తదితరులు ఎవరికివారు తమ నటనతో ఆకట్టుకున్నారు. శ్రీయ పాత్ర చాలా తక్కువున్నట్లు అన్పించింది. ఉన్నంతలో ఆమె అద్భుతంగా రాణించింది.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, కె.కె.సెంథిల్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు పెద్ద ఎసెట్‌. బహుశా అతను కెమెరా పట్టుకొని మెరుపువేగంతో పరుగులు పెట్టాడా అని అన్పిస్తుంది. సాంకేతిక విలువలు కెమెరా పనితనంలో దిట్టంగా కన్పిస్తాయి. విఎఫ్‌ఎక్స్‌ స్టాఫ్‌ పనితనం సినిమా చూస్తే ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఒక తేడా కూడా సినిమాలో కన్పించకుండా విఎఫ్‌ఎక్స్‌ నడిచినట్లు వుంది. కొన్ని వేల దృశ్యాలను ఒక చోటకు చేర్చి ఒకే దృశ్యంగా మార్చిన తీరు సినిమా సాంతం అగుపిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం రాజమౌళి సినిమాలకే సొంతమా అన్నట్లు అన్పిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుతోపాటు పాటలన్నీ అద్భుతంగా వున్నాయి. ఇప్పటికే పాటలన్నీ ప్రేక్షకుల నోళ్లలో నాటాయి. అవన్నీ దృశ్యరూపకంగా చూసిన తర్వాత అదిరిపోయాయి. ముఖ్యంగా నాటునాటు సాంగ్‌కు ప్రేక్షకులంతా డ్యాన్సులు చేయడమే తరువాయి. బుర్రా సాయిమాధవ్‌ డైలాగులు చెరుకుముక్కల్లా అన్పిస్తాయి. సీతను కలిసినప్పుడు ఎన్టీయార్‌ పలికిన సంభాషణలు, బ్రిటిష్‌వారిని ఎదుర్కొనే క్రమంలో జాతీయభావాన్ని రగిలించేలా మాటలు తూటాల్లా పేలాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఒక ఎత్తు. సినిమాను చూసినంతసేపూ ప్రేక్షకుడిని కదలనీయకుండా రాజమౌళి స్క్రీన్‌ప్లేకు తగ్గట్టుగా ఎడిటింగ్‌ సూపర్బ్‌ అన్పించింది. దర్శకునిగా రాజమౌళి మరో మెట్టు ఎక్కారు. బాహుబలి గొప్ప సినిమా అనుకుంటే, దానికన్నా గొప్ప విజువల్‌ అద్భుతాన్ని ఆవిష్కరింపజేసిన రాజమౌళి ఎక్కడా రాజీపడకుండా సినిమాను తీశారు. విజయేంద్రప్రసాద్‌ కథ, రాజమౌళి దర్శకత్వాల సమ్మేళనానికి మరో పెద్ద హిట్టు ఆర్‌ఆర్‌ఆర్‌.
జడ్జిమెంటు : ఆర్‌ఆర్‌ఆర్‌ చూసితీరాల్సిందే! చూడకపోతే మన వినోదాత్మక జీవితంలో ఒక లోటు ఉన్నట్లే!

(Story: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!)

See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1