ఆగని యుద్ధం!
రష్యా`ఉక్రెయిన్ చర్చలు మళ్లీ విఫలం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగురతూనే వుంది. ఉక్రెయిన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రష్యా దూకుడు వెరసి యుద్ధం కొనసాగడానికి దారితీసింది. బాంబుల మోతతో ఉక్రెయిన్ నగరాలు దద్దరిల్లుతున్నాయి. సయోధ్యకు టర్కీ జరిపిన రాయబారం విజయవంతంగా ఒక అడుగు ముందుకు పడినప్పటికీ యుద్ధం మాత్రం ఆగలేదు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు రెండు దేశాల విదేశాంగ మంత్రులు శాంతి చర్చలు జరిపారు. టర్కీలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భేటీ అయ్యారుగానీ చర్చలు మరలా అసంపూర్ణంగానే ముగిశాయి. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మాస్కో, కీవ్ ఉన్నత దౌత్యాధికారుల మధ్య చర్చలు ఫలించలేదని కులేబా తెలిపారు. గురువారం టర్కీలో జరిగిన సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. యుద్ధాన్ని ముగించే విషయంలో రాజీ కుదరలేదని అన్నారు. మానవతా కారిడార్లు, కాల్పుల విరమణపై చర్చించామన్నారు. రష్యాలో మరికొందరు నిర్ణేతలు ఉన్నారని, వారితోనూ సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని చెప్పారు. యుద్ధం కారణంగా నెలకొన్న మానవతా సమస్యలకు పరిష్కారం కోసం అంగీకరించినట్లు తెలిపారు. కాల్పుల విరమణకు మాస్కో సిద్ధంగా లేదని చెప్పారు. ఉక్రెయిన్ లొంగుబాటును కోరుకుంటున్నట్లు తెలిపారు. అది జరిగేలా లేదని, సురక్షితంగా నగరాల నుంచి బయట పడతామన్న ఉక్రెయిన్ ప్రజల ఆశలను నీరుగార్చే ఉద్దేశం లేదని కులేబా చెప్పారు. టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు కూడా చర్చల్లో పాల్గొన్నారు. మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని టర్కీ చాలా వారాలుగా చెబుతూనే ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేరుగా మాట్లాడటం ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా తరచూ క్రెమ్లిన్ చీఫ్‌కు ఫోన్లు చేస్తున్నారు. పరిస్థితి ఆశాజనకంగాలేదని ఫ్రాన్స్ యూరప్ మంత్రి క్లీమెంట్ బ్యూనే వెల్లడిరచారు. యుద్ధం ఆగాలన్నదే లక్ష్యమని, ఇందుకోసం రష్యాపై తీవ్ర ఒత్తిడి అవసరమని అన్నారు. కాగా, తాజా పోరులో ఉక్రెయిన్ సేనలు చెల్లాచెదురవుతున్నాయి. రష్యా సేనలకు కూడా చాలా వరకు నష్టం వాటిల్లుతోందని పశ్చిమ దేశాల మీడియా పేర్కొంది.(Story: ఆగని యుద్ధం!)
See Also: దుబాయిలో ది ఘోస్ట్ హల్‌చల్!