అక్కడ టీచర్లే గంజాయి స్మగ్లర్లా?
హైదరాబాద్ : గంజాయి ఒక మత్తుపదార్థం. నిషిద్ధం కూడా. తెలంగాణలో గంజాయి వాడకం యువతలో పెరుగుతోంది. ఇదొక పెద్ద ఆందోళనగా, ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ఎక్కువగా గంజాయి సేవిస్తున్నారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ చెపుతోంది. కొత్త విషయమేమిటంటే, కొందరు ఉపాధ్యాయులే గంజాయి మొక్కలను పెంచుతున్నారని తేలింది. కరోనా మహమ్మారి అన్ని రంగాల్లో ఉద్యోగుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసిన తర్వాత తెలంగాణలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా వారు చితికిపోయారు. దీంతో బతకడానికి కొందరు బడిపంతుళ్లు ఈ గంజాయిని ఆశ్రయించాల్సి వస్తున్నదని రెండు వారాల క్రితమే విడుదలైన ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. టీచర్లు గంజాయి మొక్కలను పెంచడం, స్టూడెంట్స్ వాటిని సేవించడంతోపాటు విక్రయించడం…ఇలా విద్యాసంస్థల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కొవిడ్ 19 కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న చాలా మంది టీచర్లు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గంజాయి మొక్కల పెంపకాన్ని ఆశ్రయించారని ఒక వార్థాసంస్థకు నిఘా అధికారులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (KCR) గత నెలాఖరులో నిర్వహించిన ఒక అత్యున్నతస్థాయి సమావేశంలో ఇంటలిజెన్స్ అధికారులు గంజాయికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ఈ టీచర్లలో ప్రైవేటుతోపాటు ప్రభుత్వ టీచర్లు కూడా వున్నట్లు సమాచారం. వారు ఇళ్లు, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారని తెలిసింది. వాస్తవానికి గంజాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా రాష్ట్రాల నుంచి హైదరాబాద్ (Hyderabad)కు వస్తున్నది. ఇప్పటివరకు పది శాతం గంజాయిని మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సొత్తును స్మగర్ల చేతికి చేర్చడానికి నేరస్తులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే పనిలేని ఉద్యోగులు ఇలా గంజాయి పెంచుతూ విద్యార్థుల చేతనే సరఫరా చేయిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం. హెరాయిన్, కొకైన్, ఎఫెడ్రైన్, చరాస్, హాషిష్, ఎండిఎంఎ వంటి మత్తుపదార్థాలను ఎక్కువగా నైజీరియన్లు హైదరాబాద్‌కు సరఫరా చేస్తూ, కాలేజీ, పాఠశాల విద్యార్థులకు చేరవేస్తున్నారు. ఈ సప్లయ్ చైన్ ఇప్పుడు పెద్దగా విస్తరించినట్లు తెలిసింది. కాకపోతే అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా గంజాయి సరఫరా విచ్ఛలవిడిగా సాగుతోంది. (Story : అక్కడ టీచర్లే గంజాయి స్మగ్లర్లా?)
See Also : డిజిటల్ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్ పెళ్లి!