విజయవాడ వరద బాధితులకు రెండు లక్షల వాటర్ ప్యాకెట్ల పంపిణీ
న్యూస్‌తెలుగు/విజయనగరం : వరద బాధితుల సహాయార్ధం జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లతో కూడిన రెండు ట్రక్కులు బుధవారం జిల్లా కేంద్రం నుండి బయలుదేరాయి. జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశాల మేరకు జిల్లా తరపున గ్రామీణ నీటిసరఫరా విభాగం ఈ రెండు ట్రక్కులతో వాటర్ ప్యాకెట్లను విజయవాడకు పంపించే ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు ట్రక్కులతో సిద్ధంగా వున్న లారీలను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, ఎస్.పి. వకుల్ జిందాల్ తో కలసి బుధవారం ప్రారంభించారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచనల మేరకు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఈ ప్యాకెట్లను అందిస్తామని గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్.ఇ. డి.ఉమాశంకర్ చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయవాడలో ఎన్నడూలేని విధంగా వరదలు సంభవించాయని, అక్కడి వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయం అందించాలని కోరారు. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు వరద బాధితులకు రూ.10 లక్షలు సహాయంగా ప్రకటించారని, జిల్లాలోని అన్ని వర్గాల వారు తమ వంతుగా సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, గ్రామీణ నీటిసరపరా ఎస్.ఇ. డి.ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. (story : విజయవాడ వరద బాధితులకు రెండు లక్షల వాటర్ ప్యాకెట్ల పంపిణీ)