రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పెండింగ్ ధరణి దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలి
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని సకాలంలో పూర్తిచేయాలి
3 నెలలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై వర్క్ షాప్ నిర్వహణ
రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి
న్యూస్‌తెలుగు / అమరావతి : రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి వనరుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు
మంగళవారం ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర సి.ఎస్. శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎల్.ఆర్.ఎస్, భారీ వర్షాలు, ధరణి, ఆర్.ఓ.ఆర్. చట్టం పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి తొ కలసి ఈ విడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్. కు సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. సిబ్బంది కొరత ఉన్నచోట అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన అదనపు సిబ్బందిని నియమించుకొని పనులు పూర్తిచేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించాలని, జిల్లాలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రకారం అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వారు వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేసేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సర్వే నెంబర్ల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం/మున్సిపాలిటీ లలో బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేస్తారని, అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, హెరిటేజ్ బిల్డింగ్, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలోవి కావని ధ్రువీకరించాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ 3 నెలలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడ ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని, అదే విధంగా నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు పాల్పడవద్దని అధికారులకు సూచించారు.
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని కట్టుదిట్టంగా సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి సూచించారు.
ధరణి పోర్టల్ లో పెండింగ్ ఉన్న దరఖాస్తుల స్క్రుటిని పూర్తి చేసి పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు సదరు కారణాలు తెలియజేయాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లు ప్రతిపాదించిందని, దీని పై జిల్లా లలో ఆగస్టు 23, 24వ తేదీలలో వర్క్ షాప్ నిర్వహించి, ముసాయిదా బిల్లులో చేయాల్సిన మార్పులు, మెరుగైన సూచనలు ఏవైనా ఉంటే ఫీడ్ బ్యాక్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అందజేయాలని మంత్రి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి)