కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?
న్యూస్ తెలుగు/సిద్ధిపేట జిల్లా ప్రతినిధి ( నారదాసు ఈశ్వర్ ): ప్రస్తుతం మన ఆరోగ్య ఆహార రీత్యా ఏది ఎలా కల్తీ అవుతుందో ప్రజలు తెలుసుకోలేని అయోమయ పరిస్థితి రాజ్యమేలుతోంది. పండ్లు, ఆహార పదార్థాలు, తినుబండారాల్లో నాణ్యతను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా లేబొరెటరీలు ఉన్నా, నామమాత్రంగా ‘శాంపిల్స్’ సేకరించి మొక్కుబడిగా కేసులు పెట్టడం తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల అండదండలు, కేసుల విచారణలో జాప్యం వంటి కారణాలతో ‘కల్తీ దందా’ నిరాటంకంగానే కొనసాగుతోంది.
ఏటా 2.2 మిలియన్ల మంది మృతి..
కల్తీ ఆహార పదార్థాల వల్ల రోగాల బారిన పడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.2 మిలియన్ల మంది మరణిస్తున్నారని, వీరిలో చిన్నపిల్లల సంఖ్య అధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఇదివరకే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. క్షేమకరం కాని ఆహార పదార్థాలతో పలురకాల బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, విషపూరిత రసాయనాలు మన శరీరాల్లోకి చేరుతున్నాయి. కల్తీ ఆహారం ఫలితంగా డయేరియా, క్యానర్లు వంటి 200 రకాల వ్యాధులు విజృంచడంతో ప్రజారోగ్య వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోంది. వైరస్‌లు, రసాయనాల ప్రభావం లేని విధంగా నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా ఈ ఏడాది ‘ఆహార భద్రత’ నినాదాన్ని పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ లక్ష్యం నెరవేరేలా ప్రభుత్వాలు, పౌర సమాజాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవ చూపాలని డబ్ల్యుహెచ్‌ఓ సూచించింది. ఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, సరఫరా, విక్రయం అనే విషయాలు అత్యంత కీలకమైనవని, ఏ స్థాయిలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటే ప్రజారోగ్య వ్యవస్థకు విఘాతం కలగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల ప్రభావం లేకుండా వ్యవసాయోత్పత్తులను విక్రయించాలి. ప్యాకేజీ ఫుడ్ తయారీ, నిల్వలో ప్రమాణాలు పాటించాలి. వినియోగదారులు కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. శుభ్రత, నాణ్యత ప్రాతిపదికగా ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి.
ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలిపితే అయ్యో…కల్తీ జరిగిందని వాపోయేవారు. ఇప్పుడు పాలల్లో నీళ్లకు బదులు ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. సింథటిక్ పాలు అలాంటివే. కనుక వినియోగదారులు జాగ్రత్తగా లేకపోతే మోసపోవడం, రోగాలపాలవడం ఖాయం. మోసగించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మోసపోకుండా ఉండటం వినియోగదారుడి తెలివిపై ఆధారపడి ఉంటుంది. అప్పుడే మీ ఇంట కల్తీకల్లోలం రేపదు.
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?
కలియుగంలో కల్తీలేని పదార్థాలు దొరకడం కష్టం. వినియోగదారుడే తెలివిగా వ్యవహరించి కల్తీలేని సరుకులు కొనుక్కోవాలి. మనం తినే ఆహారం కల్తీ వస్తువులతో తయారైనదైతే చేజేతులా మన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవాళ్లమవుతాం. అందుకే మనం నిత్యం వాడే పదార్థాల్లో సాధారణంగా కల్తీ ఎలా జరుగుతోందో, వాటివల్ల కలిగే నష్టాలేమిటో, వాటిని కనిపెట్టడం ఎలాగో న్యూస్ తెలుగు మీ కోసం అందిస్తుంది….
పాలు
* డిటర్జెండ్ పౌడర్, యూరియా, సింథటిక్ మిల్క్‌తో కల్తీ చేస్తారు.
* కొద్దిపాలలో అంతే మొత్తం నీళ్లు కలిపితే డిటర్జంట్ కలిపిన విషయం తెలిసిపోతుంది. పాలను వెచ్చపెడితే పసుపు వర్ణంలోకి మారినా, తాగినప్పుడు చేదుగా ఉన్నా అవి సింథటిక్ పాల కల్తీ జరిగినవని తెలుసుకోవచ్చు.
* కల్తీపాలు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కేన్సరుకు దారితీయొచ్చు.
తేనె
* పంచదార, బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తారు.
* పట్టుపీలికపై తేనె వేస్తే అంటుకోకుండా జారిపోతే అది అసలు తేనె. అంటుకుంటే అది కల్తీ జరిగినట్టే. తేనెలో ముంచిన అగ్గిపుల్లను వెలిగిస్తే వెంటనే మండితే అది అసలు తేనె. కల్తీది అయితే ఆ పుల్ల వెలగదు లేదా చిన్నచిన్న శబ్దాలతో ఆరి వెలుగుతుంది.
* అజీర్తి సమస్య రావొచ్చు. గ్లూకోజ్ పరిమాణం అమాంతం పెరిగి మధుమేహ బాధితులకు సమస్యగా మారుతుంది.
ఐస్‌క్రీమ్
* పిల్లలు, కుర్రకారు ఎక్కువగా ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లోనూ కల్తీ జరుగుతోంది. వాషింగ్ పౌడర్‌ను ఇందులో కల్తీచేస్తూంటారు.
* అనుమానం వస్తే కొద్దిగా ఐస్‌క్రీమ్‌పై నిమ్మరసం పిండండి. నురగ, బుడగలు వస్తే అది కల్తీ జరిగినట్టే
* కల్తీ ఐస్‌క్రీమ్‌లు తింటే ఉదర, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.
టీ పొడి
* చక్కటి రంగుకోసం బొగ్గు, తారుతో కూడిన రంగులు వాడతారు.
* తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై టీపొడి జల్లి ఐదు నిమిషాల తరువాత చూస్తే వాటిపై రంగు మచ్చలు ఏర్పడితే అది కల్తీ జరిగినట్లే.
* నిషేధిత రంగులు వాడిన పొడిని ఉపయోగిస్తే కేన్సర్ రావొచ్చు.
ఉప్పులోనూ…
* సాధారణ ఉప్పులో సుద్దపొడి, అయొడైజ్డ్ ఉప్పులో సాధారణ ఉప్పు కల్తీ చేస్తారు.
* ఉప్పు కలిపిన నీళ్లను వేడిచేస్తే సుద్దపొడి పైకి తేలిపోతుంది. బంగాళదుంప ముక్కపై అయొడైజ్డ్ ఉప్పు జల్లి, కొద్దిగా నిమ్మరసం కలిపి వేచిచూడాలి. ఆ దుంపపై నీలిమచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్లు లెక్క.
* అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
యాపిల్స్
* తళతళ మెరుస్తూ కన్పిస్తే- ఆ యాపిల్ పళ్లకు మైనం పూశారని అర్థం. సహజ సిద్ధంగా పండిన యాపిల్స్ దోరగా ఉంటాయి తప్ప ఎలాంటి మెరుపు ఉండదు.
* పండును నిశితంగా పరిశీలిస్తే మైనం పూత తెలిసిపోతుంది. తొక్కతీసే ప్రయత్నం చేస్తే మరీ స్పష్టంగా రూఢీ అవుతుంది.
* వాక్స్ పూసిన యాపిల్స్ తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతిని అల్సర్లు ఏర్పడతాయి. ఎసిడిటీ సమస్య వస్తుంది.
నల్ల మిరియాలు
* ఎండబెట్టిన బొప్పాయి గింజలు కలుపుతారు.
* డిస్టిల్డ్‌వాటర్‌లో గింజలు వేస్తే కొద్దిసేపటికి బొప్పాయి గింజలు పైకి తేలుతాయి. మిరియాలు అడుగుకు చేరతాయి.
* కాలేయ, ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి.
అరటి, మామిడి
* వీటిని మగ్గబెట్టి పండేలా చేయడానికి కాల్షియం కార్బైడ్ వాడతారు.
* అరటిపండు పచ్చగా ఉన్నా మొదట్లో ఉండే తొడిమె పసిమి ఛాయతో కాకుండా ఆకుపచ్చగా ఉంటే అది సహజ సిద్ధంగా పండినది కాదని అర్థం. మామిడి అయితే పండు అంతా ఒకేరంగులా ఉన్నా, ఉపరితలంపై ఆకుపచ్చటి మచ్చలు మిగిలినా అవి కృత్రిమంగా పండించినవని తెలుసుకోవచ్చు.
* ఇలాంటి పళ్లు తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతిని, కేన్సరు రావచ్చు.
మిర్చిపొడి
* మరీ ఎర్రగా, పొడిపొడిగా ఉంటే కల్తీ జరిగిందని అనుమానించవచ్చు. సాధారణంగా కర్రపొట్టు, నిషేధిత రంగు, ఇటుకల పొడి కలిపి మోసం చేస్తూంటారు.
* మిర్చిపొడిని కొంత తీసి నీళ్లలోవేస్తే ఇటుకల పొడి నీటి అడుగుల చేరుతుంది. రంగు వదిలిపోతుంది. అసలు కారం నీళ్లపై తేలుతుంది.
* కల్తీ కారప్పొడి తింటే దృష్టిదోషాలు, జీర్ణవ్యవస్థ దెబ్బతినడటం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
కూరగాయలు
* కాకర, బెండ, పచ్చిమిర్చి వంటి ఆకుపచ్చటి కూరగాయలు నిగనిగలాడుతూ కన్పించేందుకు కొన్ని నిషేధిత రంగులు వాడతారు.
* అనుమానం వస్తే వాటి ముక్కలను తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై వేసి చూస్తే రంగుల మచ్చలు ఏర్పడితే మోసం జరిగినట్లే.
ప్రాసెస్‌డ్ ఫుడ్
* టిన్‌లు, ప్యాకింగ్‌లలో నిల్వ ఉంచి అమ్మే పదార్థాలలో వాడే కొన్ని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
* బ్రెడ్, పాస్ట్రా, చేపలు, కేకులు, కుకీలు, మాంసాహార ఉత్పత్తులు నిల్వ చేయడానికి అధికమొత్తంలో సోడియం బెంజోట్, ఫాస్పరిక్ యాసిడ్, బోరిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, సోడియం సాల్ట్స్ వాడతారు.
* కిడ్నీలు, ఊపిరితిత్తులు, వెన్నెముక, వృషణాలు, హృదయ సంబంధ వ్యాధులు రావొచ్చు. కిడ్నీ, బిపి, మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండాలి.