ముంపు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన
న్యూస్‌తెలుగు/విజయనగరం: విజయనగరం టౌన్ నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులకు గురైన పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు పర్యటించి యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టారు.6,12,35,37,59, సచివాలయాల పరిధిలలో జరుగుతున్న పారిశుధ్య పనులు, కాలువల్లో పూడికతీత పనులు, నేలకొరిగిన చెట్లను ప్రక్షాళన చేసే కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించారు. కట్టర్ల సహాయంతో విరిగిపడిన చెట్ల కొమ్మలను కత్తిరించి రహదారికి ఇబ్బందు లేకుండా తొలగించి వేశారు. ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను, పూడికను పారిశుద్ధ్య సిబ్బందితో తీయించి వేశారు. అలాగే దాసన్నపేట రైతు బజారు వద్దకు వెళ్లి కూరగాయల విక్రయదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకత పై అవగాహన కల్పించారు.క్యారీ బ్యాగ్ లు వినియోగించవద్దని హెచ్చరించారు. మరోసారి తన పర్యటనలో ప్లాస్టిక్ సంచుల వినియోగం కనిపించినట్లయితే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పోల్లయ్యపేట చేరుకుని అక్కడ కాలువ పరిస్థితి గమనించారు. ప్రధాన కాలువ ప్రవాహం నిలిచిపోవడంతో అందుకు గల కారణాలను సమీక్షించారు. డిఈ అప్పారావు, శానిటేషన్ కార్యదర్శులతో కాలువలో వర్షపు నీరు ప్రవాహానికి చేపట్టాల్సిన చర్యలు గూర్చి వివరించారు. ఈ సందర్భంగా కమీషనర్ ఎం ఎం నాయుడు మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న వర్షాలకు ఇబ్బందుల తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడడం, కాలువల్లో చెత్త పేరుకుపోవడం వంటివి జరిగిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. (Story : ముంపు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన)