గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని సందర్శించిన
కమిషనర్ వి.కరుణ
న్యూస్ తెలుగు /సాలూరు : గర్భిణీ స్త్రీల వసతి గృహాల్లో వైద్య సేవలు, సదుపాయాలు బాగున్నాయని వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సాలురులోని ఐటిడిఎ వైటిసి భవనంలో గల గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. అక్కడ గర్భిణీ స్త్రీలకు అందుతున్న సదుపాయాలు, వేక్సిన్లు గురించి అడిగి తెలుసుకొని పండ్లను పంపిణీ చేశారు. తమకు ఎటువంటి సమస్యలు లేవని, సమయాను కూలంగా అన్ని సదుపాయాలు అందుతున్నట్లు గర్భిణీలు కమిషనర్ కు తెలిపారు. సాలూరు, కురుపాం, గుమలక్ష్మిపురం ప్రాంతాల్లో ఇటువంటి వసతి గృహాలను నిర్వహించడం పట్ల కమిషనర్ సంతోషం వ్యక్తం చేశారు. అదనపు వసతి గృహాలపై ఆమె ఆరా తీశారు. వసతి గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయని మీడియా ప్రతినిధులు కమిషనర్ కు తెలియజేయగా నిధులు అందుబాటులో ఉన్నాయని, అన్నింటిని పరిష్కరిస్తామని ఈ సందర్బంగా తెలిపారు. తొలుత పార్వతీపురం మండలం ఎం.ఆర్.నగర్ లోని గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.విజయపార్వతీ, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.వినోద్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా. కె.అప్పారావు, వసతి గృహ మెడికల్ ఆఫీసర్లు,వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని సందర్శించిన కమిషనర్ వి.కరుణ)