UA-35385725-1 UA-35385725-1

అమరావతే రాజధాని!

అమరావతే రాజధాని!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని దాదాపుగా తేలిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా అమరావతిని గుర్తించింది. ఇటువైపు హైకోర్టు కూడా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో అమరావతి ఉద్యమకారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం రేకెత్తింది. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. 24 గంటల వ్యవధిలో అమరావతికి అనుకూలంగా జరిగిన పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. గురువారంనాడు ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోర్టు తేల్చిచెప్పింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని, దానికి అనుగుణంగానే నిర్మాణం పూర్తికావాలని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెల్సిందే. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం(యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 75 కేసుల్లో వేర్వేరుగా త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించినట్లయింది.
ఇతర అవసరాలకు అమరావతి భూములు తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు చెప్పడం కీలకంగా మారింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పైగా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించవద్దని కూడా క్లియర్‌గా చెప్పింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలని కోర్టు పేర్కొంది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని కూడా తేల్చిచెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా పేర్కొంది. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇదిలావుండగా, ఏపీ రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. బడ్జెట్‌లో అంచనా వ్యయం కింద అమరావతికి నిధులను ప్రతిపాదించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేవలం లక్ష రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. ఈ లక్ష రూపాయలతో అమరావతి రాజధాని పూర్తికాదని అందరికీ తెలుసు. కాకపోతే ఈ నిధుల కేటాయింపును బట్టి కేంద్రం కూడా అమరావతినే రాజధానిగా గుర్తించినట్లు స్పష్టమవుతున్నది. సచివాలయ నిర్మాణానికి రూ. 1,214 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాలకు రూ.1,126 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ అంచనాల్లో స్పష్టం చేసింది. జీపీవోఏకి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. 2020`21, 2021`22 బడ్జెట్‌లలో మొత్తం రూ.4.48 కోట్లను కేంద్రం ఖర్చుచేసినట్లు వివరించింది. అలాగే 300 ఏజీస్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఏదేమైనప్పటికీ, అమరావతికి మంచిరోజులు వచ్చినట్లేనని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. (Story: అమరావతే రాజధాని!)

See Also: ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై

 I love doing different characters

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1