UA-35385725-1 UA-35385725-1

పీడితుల పక్షాన ఝళిపించిన కలం

ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డికి  ఘననివాళి

కడప : పీడితుల పక్షాన తన కలాన్ని ఝళిపించిన మానవతావాది, అభ్యుదయ భావాలతో సాహిత్యాన్ని సామాజిక శాస్త్రాలతో అధ్యయనం చేసిన గొప్ప కథారచయిత, విమర్శకుడు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి అని ప‌లువురు ప్ర‌ముఖులు అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కడపజిల్లా శాఖ అధ్యక్షులు ఆచార్య నల్లపరెడ్డి ఈశ్వర రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌  ప్రసిద్ధ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి సంస్మరణ సభను అరసం కడపజిల్లా శాఖ, వైవియూ సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా ఆదివారం ఉదయం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహించాయి. తొలుత వక్తలు, సాహితీవేత్తలు కేతు విశ్వనాథ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజ‌రైన సి.పి.ఐ. రాష్ట్ర నాయకులు జి.ఓబులేసు మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యాన్ని, మార్క్సిస్టు తాత్వికతను ఆయన ఒంటపట్టించుకొన్నారని తెలిపారు. ఆయన మననుంచి దూరం కావడం దిగ్భ్రాంతికరమన్నారు. కమ్యూనిస్టు పార్టీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉండేదన్నారు. విశాలాంధ్రకు ఆయన అందించిన సేవ శ్లాఘనీయమని, ఆయన కథలు, నవలలు,ఇతర రచనలను విశాలాంధ్ర ద్వారా పుస్తకాలుగా తీసుకువస్తామన్నారు. ఆయన రచించిన ‘నమ్ముకున్న నేల’ జనహృదయానికి దగ్గరగా ఉందని, యథార్థ సంఘటనలు అందులో కనిపిస్తాయన్నారు. యువ రచయితలను వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధనకేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సాహితీ రంగంలో విశ్వనాథ రెడ్డి తనకు మార్గదర్శకులన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయ అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయమన్నారు.
అరసం కడపజిల్లా శాఖ అధ్యక్షులు ఆచార్య ఈశ్వర రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి తన చుట్టూ ఉన్న సమస్యలను, పుట్టి పెరిగిన ప్రాంత జీవితాన్ని కథలుగా మలచిన విశిష్ట రచయితని కీర్తించారు. మనుషులను ప్రేమించేవాడని, ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని, దళితుల దైన్యస్థితిని, లింగ వివక్షతను తన కథల ద్వారా ఎండగట్టారన్నారు. 1980లో స్త్రీవాదం పుట్టుకొస్తే ఆచార్య కేతు 1977లోనే పురుషులతో సమానంగా మహిళలు నిలబడాలని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకొద్దంటూ రచనలు చేయడం విశేషమన్నారు. పంటలు లేని పొలాలను చూస్తే శుభ్రం చేసిన పలకలా ఉన్నాయంటూ ఆనాటి స్థితిని పోల్చారని చెప్పారు. ఆయన అందరిలో ఒకడిలా కుల, మత, వయోభేదం లేకుండా ఆదర్శనీయ జీవితం గడిపారని తెలిపారు. ఆచార్య కేతు కథలను రేపటి తరానికి అందించి చదివించగలిగితే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, అదే మనం ఆయనకిచ్చే ఘననివాళి అన్నారు. వైవియూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌  సందేశాన్ని వినిపిస్తూ ఆచార్య కేతుకు విశ్వవిద్యాలయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ తెలుగు శాఖకు మార్గదర్శనం చెయ్యడమే కాక గజ్జెల మల్లారెడ్డి అవార్డు ఎంపికలో కీలకపాత్ర పోషించారని, బ్రౌన్‌ సలహామండలి సభ్యులుగా సేవలందించారని పేర్కొంటూ నివాళి అర్పించారు. ఆం.ప్ర.అభ్యుదయ రచయితలసంఘం గౌరవాధ్యక్షురాలు డా॥ పి.సంజీవమ్మ మాట్లాడుతూ తనకు ఆచార్య కేతుతో తనకు 1973 నుండి పరిచయం ఉందని, 1974లో అరసం మొదటి కథాసంపుటాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంలో ఆయన స్పందన వ్యక్తం చేస్తూ రాయలసీమ కథకు, రాయలసీమ సాహిత్య చైతన్యానికి గుర్తింపుగా వచ్చిన పురస్కారంగా నిరాడంబరంగా పేర్కొన్నారన్నారు. ఆయన విమర్శ వ్యాసాలను ‘దృష్టి’ పేరుతో గ్రంథంగా తెచ్చారని, వేరు, బోధి అనే నవలలు రాశారని, అవి చాలా ప్రభావపూరితమైనవన్నారు. ఆయనను రాయలసీమకో, రాష్ట్రానికో పరిమితం చెయ్యకూడదని, ఆయన రచనలు అనేక జాతీయ భాషల్లోకి అనువదితమయ్యాయని, అందువల్ల ఆయనను భారతీయ జాతీయ అభ్యుదయ కథారచయితగా చూడాలన్నారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సేకరించి, విషయపరంగా విభజించి, ఆరు భాగాలుగా కేతు తన సంపాదకత్వంలో తీసుకువచ్చారన్నారు. విద్యారంగానికి పాఠ్యపుస్తక సంపాదకులుగా విశేష సేవలందించడమే కాక అభ్యుదయ వాదాన్ని పాఠ్యాంశాల్లోకి తీసుకువచ్చి ఉన్నతీకరించారన్నారు.
సి.పి.ఐ. కడపజిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అరసం ప్రతి ఏటా ఆయన పేరుతో సదస్సులునిర్వహించి అవార్డులు ఇచ్చేలా చూడాలని కోరారు. కెస్కో సంస్థ వ్యవస్థాపకులు అలపర్తి పిచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా ప్రతి ఏటా కేతు విశ్వనాథ రెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ప్రముఖ కథారచయిత పాలగిరి విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ కేతు విశ్వనాథ రెడ్డి రాయలసీమ ప్రాతినిధ్య రచయిత అని, తాను రచయిత కావడానికి ఆయనే దారిదీపమన్నారు. జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్‌ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్‌ మాట్లాడుతూ ఆచార్య కేతు వ్రాతప్రతులను సేకరించి సి.పి.బ్రౌన్‌ గ్రంథాలయంలో భద్రపరచాలని కోరారు. రాయలసీమ టూరిజం కల్చరల్‌ సొసైటి చీప్‌ ప్యాట్రన్‌ లయన్‌ పోతుల వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ విశ్వనాథ రెడ్డి తన రచనల చిరంజీవి అని, ఆయన తన రచనలను ఆస్తిగా మనందరికీ ఇచ్చి వెళ్ళారన్నారు. సి.పి.యం. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, ప్రముఖ కథారచయిత తవ్వా ఓబుల్‌ రెడ్డి, డా॥ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం సభ్యులు డా॥ తవ్వా వెంకటయ్య, బాసట స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు యం.బాలాజీ రావు, కొండూరు పిచ్చమ్మ వెంకట రాజు స్మారక సంస్థ అధ్యక్షులు లయన్‌ కొండూరు జనార్దన రాజులు కేతు విశ్వనాథ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అరసం కడపజిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డా॥ తుమ్మలూరు సురేష్‌బాబు స్వాగతం పలికారు. ఒడిస్సా రైలు దుర్ఘటన మృతుల ఆత్మశాంతికి సభ మౌనం పాటించింది. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగా సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు డా॥ ఎస్‌. రాజగోపాల రెడ్డి, డా॥ తక్కోలు మాచిరెడ్డి, హజరతయ్య, కుమారస్వామి రెడ్డి, డా॥ వెల్లాల వేంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నాను. (Story : పీడితుల పక్షాన ఝళిపించిన కలం )

See Also :

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం!

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1