కాజ్‌వేలు, కల్వర్టులు వంతెనల వద్ద అప్రమత్తంగా వుండాలి
వాటిపై నుంచి నీటిప్రవాహం వుంటే రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలి
మడ్డువలస ప్రాజెక్టు ద్వారా నీటివిడుదలను పెంచాలి
స్కూళ్లు, విద్యా సంస్థలు, అంగన్ వాడీలకు నేడు సెలవు
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం(గుర్ల) : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కాజ్ వేలు, వంతెనలు, కల్వర్టులు, రోడ్లపై నుంచి నీటి ప్రవాహం జరిగే అవకాశం వుందని అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాటిపై రాకపోకలు చేయకుండా నియంత్రించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. వాటిని దాటే ప్రయత్నం చేసే అవకాశం వుంటుందని ఆయా ప్రదేశాల్లో రెవిన్యూ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదివారం గుర్ల మండలం ఆనందపురంలో కాజ్ వే వద్ద చంపావతి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రవాహం అధికంగా వున్నందున ప్రమాదాలేవీ జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. గుర్ల తహశీల్దార్, చీపురుపల్లి ఆర్.డి.ఓ.లతో మాట్లాడారు. ఆండ్ర రిజర్వాయరు నుంచి ప్రస్తుతం నీటి విడుదల లేనందున చంపావతి పరివాహక ప్రాంతాలకు ముప్పు లేదని అయితే కాజ్ వే వద్ద ఇరువైపులా ప్రజలు అంచుల వరకు వెళ్లకుండా హెచ్చరికగా ఎర్రటి రిబ్బను కట్టి వుంచాలన్నారు. యువకులు ప్రవాహం సమీపం వరకు వెళ్లి సెల్ఫీల కోసం ప్రయత్నించకుండా నిరోధించాలని చెప్పారు. చంపావతి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా గ్రామస్థులు సహకరించాలని కోరారు.
మడ్డువలస ప్రాజెక్టు వద్ద పరిస్థితిపై ఆర్.డి.ఓ. బి.శాంతితో చర్చించారు. ప్రాజెక్టు నుంచి అధిక పరిమాణంలో నీటిని విడుదల చేస్తే వరద ముంపు నుంచి తప్పించవచ్చని నీటి విడుదలను పెంచాలని సూచించారు. ప్రాజెక్టు నీటిమట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తహశీల్దార్ ఆదిలక్ష్మి, రెవిన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఉదయం తాటిపూడి రిజర్వాయరును సందర్శించి నీటినిల్వలను పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులతో ప్రాజెక్టు ఇన్ ఫ్లోలపై చర్చించారు. నీటిని విడుదల చేసినపుడు దిగువ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని ముందుగా అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
అనంతరం నగరంలోని పెద్ద చెరువు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మునిసిపల్ అధికారులతో మాట్లాడి చెరువులో వరద నీటి ప్రవాహ పరిస్థితిపై ఆరా తీశారు. వదంతులను నమ్మవద్దని చెరువుకు ఎలాంటి గండి పడలేదని యీ సందర్భంగా చెప్పారు. ధర్మపురి ప్రాంతంలోనూ పర్యటించి అక్కడి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలించారు.
వాతావరణ శాఖ జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షసూచన చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, ఆర్.డి.ఓ.లు, తహశీల్దార్ లు, ఎంపిడిఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా మండలాలు, మునిసిపాలిటీల్లో అందుబాటులో వుండాలని ఆదేశించారు. అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా మండలాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. జిల్లాలో నాలుగు మండలాల్లోనే అధిక వర్షపాతం నమోదయ్యిందని, అందువల్ల ఆయా మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపునకు గురికాకుండా వారికి తగు అప్రమత్తం చేయాలన్నారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్లో నిల్వలు సాధారణ స్థాయిలోనే వున్నందున ప్రస్తుతానికి వాటికి ఇబ్బందేమీ లేదన్నారు. అయితే భారీవర్షాలు కొనసాగితే వాటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అందువల్ల అప్రమత్తంగా వుండాలన్నారు.
జిల్లాలో సోమవారం కూడా భారీవర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖసూచించినందున ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కూడా రద్దు చేస్తున్నట్టు చెప్పారు.