చట్టసభలా… భజన సభలా..!
` అసెంబ్లీ స్థాయిని దిగజార్చారు..
` ప్రతిపక్షాలను తిట్టడానికి, సీఎంను పొగడటానికే సమావేశాలా..?
` ముఖ్యమంత్రికి భజన చేయడానికి అసెంబ్లీ అవసరమా?
` తాడేపల్లి ప్యాలెస్‌లో భజన చేసుకోవచ్చు కదా
` ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం
విజయవాడ : పవిత్రమైన చట్టసభలను ముఖ్యమంత్రికి భజన సభలుగా మార్చేశారని అధికార వైసీపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత విలువైన బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించకుండా కేవలం ప్రతిపక్షాలను తిట్టిడానికి, ముఖ్యమంత్రిని పొగడటానికే మంత్రులు, అధికార పార్టీ సభ్యులు పరిమితమయ్యారని మండిపడ్డారు. విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేషు, సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే…
` ముఖ్యమంత్రికి భజన చేసేందుకు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎందుకు?
` తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం భజన చేసుకోవచ్చు కదా…!
` 1953 నుంచి ఇప్పటివరకు ఇంత అధ్వానంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ నిర్వహించలేదు.
` నేను కూడా ఎమ్మెల్యేగా కొనసాగాను. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించడం, మంత్రులు, అధికార పక్షం సమాధానం చెప్పడం సహజం. అటువంటి మంచి సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి చర్చ లేకుండా సీఎం భజనకే పరిమితమయ్యారు.
` ఏకంగా హైకోర్టు జడ్జిలను ఎలా నియమించాలి, వారి హద్దులు ఏమిటీ అనేది కూడా ఎమ్మెల్యేలు మాట్లాడటం, న్యాయవ్యస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచిపద్ధతి కాదు.
` స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పడం, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు.
` ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా వల్ల ఎవరూ మరణించలేదని చెప్పడం దుర్మార్గం.
` కల్తీసారా తాగి 26 మంది మరణించారు. మేము మృతుల ఇళ్ల వద్దకు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించి పేర్లు కూడా ప్రకటించాము. ఆ పేర్లలో ఒక్కరు కూడా కల్తీ సారా తాగి మరణించలేదని ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ అసెంబ్లీలో మాత్రం జంగారెడ్డిగూడెంలో కల్తీసారా లేదని సీఎం చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికైనా బాధిత కుటుంబాలను బెదిరించకుండా, కల్తీసారా వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
` రాజధాని విషయంలో సీఎం పదేపదే మాటమారుస్తూ అబద్ధాలు చెబుతున్నారు. అమరావతిలో రాజధానికి జగన్ అంగీకారం తెలిపారు. 30వేల ఎకరాలు భూమి కావాలని చెప్పారు. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రోజుకొక మాటచెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
` అసెంబ్లీ సమావేశాల సమయంలో వివిధ సమస్యలపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరడానికి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చేందుకు రావడం, నిరసనలు తెలియజేయడం సహజం.
` గుంటూరు జిల్లా వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ప్రజలకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరింస్తూ అక్రమంగా అరెస్టు చేయించడం, రెండు, మూడు రోజులు గృహ నిర్బంధంలో ఉంచడం దుర్మార్గం. ప్రజలు, ప్రజా సమస్యలు అంటే ఏమాత్రం లెక్కలేని ప్రభుత్వం నిర్బంధకాండను సాగించింది.
` స్పీకర్ పదవిలో ఉన్నవారు అందరినీ సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాలి. ఇందుకు విరుద్ధంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష సభ్యులు నోరు తెరిచినా, నిలుచుని నిరసన తెలియజేసినా వెంటనే సస్పెన్షన్ విధించడం సరికాదు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రిపదవి కేటాయించి, చట్టసభల నిర్వహణ, చట్టాలు, సభా నియమాలు, అందరినీ సమానంగా చూడగలిగే వ్యక్తిని స్పీకర్‌గా నియమించాలి. పవిత్రమైన స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలని ముఖ్యమంత్రికి సూచించారు.
` కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రికను జయప్రదం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. (Story: చట్టసభలా… భజన సభలా..!)
See Also: టెట్ పరీక్షల సిలబస్ ఇదే!