జర్నలిస్టులకు ఇండ్ల జాగలు ఇవ్వండి
-ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
-మంత్రి శ్రీధర్ బాబును కలిసిన జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ నేతలు
న్యూస్‌తెలుగు/ అమరావతి :అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలిచ్చి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు జర్నలిస్టులకిచ్చిన హామీని నెరవేర్చాలని పలువురు జర్నలిస్టు నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి. ఆనందం తదితరులు బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పై మంత్రితో చర్చించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సమస్య జఠిలంగా ఉందని అధ్యక్షుడు మామిడి సోమయ్య మంత్రితో అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న కొంత మంది జర్నలిస్టులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వాలు ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లు అధికారంలో వున్న టీఆర్ ఎస్, బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో సొసైటీ ప్రతినిధులు సీతారామచందర్ రావు,సీహెచ్ వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, మహిళా జర్నలిస్టులు పి.నాగవాణి,పుష్పలత తదితరులున్నారు.
జీవో ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు- మంత్రి శ్రీధర్ బాబు
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రత్యేక జీవో రావాలని, ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. సచివాలయంలో ఆయనను కలిసిన జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య చాలా కాలంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, జర్నలిస్టుల సమస్యల విషయంలో ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం చేస్తారని, అందుకు తనవంతు కృషి కూడా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. (Story : జర్నలిస్టులకు ఇండ్ల జాగలు ఇవ్వండి )