పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి పట్టణ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములుడిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ జిల్లా ఆఫీసులో సిపిఐ పట్టణ నిర్మాణ కౌన్సిల్ విస్తృతస్థాయి సమావేశం గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విజయ రాములు పాల్గొని మాట్లాడారు. 2008 భూ పోరాటంలో పట్టణంలో అర్హులైన 685 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని,ఇంతవరకు ఇండ్లు నిర్మించలేదన్నారు. వీరు కాక చాలామంది అర్హులైన పేదలు ఉన్నారని అందరికీ న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వంకొత్త రేషన్ కార్డులు ప్రకటించిందని వెంటనే ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించి, కార్డులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించారని విచారించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలన్నారు. వనపర్తిలో డ్రైనేజీ సమస్యతో వస్తున్నాయని, అండర్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. చాలా ఏళ్లుగా ఇది హామీగానే మిగిలిందన్నారు. రోడ్ల విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఐదేళ్ల క్రితం శ్రీనివాసపూర్, రాజనగరం, మర్రికుంట, నాగవరం, నర్సిం గాయపల్లి గ్రామాలను వనపర్తి మున్సిపాలిటీలో విలీనం చేశారని ఇప్పటివరకు కనీస వసతులు కల్పించడంతో విఫలమయ్యారన్నారు. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు వెంటనే కల్పించాలన్నారు.పట్టణంలో పార్కుల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని విచారణ జరిపి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని, ప్రజలకు ఉపయోగపడే రీతిలో పార్కులను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. పట్టణ సమస్యలను పరిష్కరించకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షులు జయమ్మ, శిరీష, ఎర్ర కుర్మయ్య, లక్ష్మీనారాయణ, చిన్న కురుమన్న, ఎత్తం మహేష్, ఎత్తం విష్ణు, చంద్రశేఖర్, చిన్న వెంకటేష్, శాంతన్న తదితరులు పాల్గొన్నారు. (Story : పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి : సిపిఐ)