వ్యవసాయకార్మికుల బతుకులకుఅసలు భద్రత భూమి : కలకొండ కాంతయ్య
న్యూస్ తెలుగు /వనపర్తి : వ్యవసాయ కార్మికుల బతుకు భద్రత కల్పించేది వ్యవసాయ భూమి అని, రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలకొండ కాంతయ్య పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ కార్మికులకు బతుకు భద్రత నిచ్చే భూమి ఇవ్వకుండా, ఇండ్లు ఇండ్ల స్థలాలు పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో పాలన ఎంతకాలం సాగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడచినా దేశంలో ఇంకా 50 శాతం వ్యవసాయ కార్మికులు ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయన్నారు. వాళ్ల భవిష్యత్తు కోసం నిర్దిష్ట చర్యలు చేపట్టకపోవటమే కారణమన్నారు. వ్యవసాయ కార్మికులకు గ్రామాల్లో గిట్టుబాటు కూలి అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఏటా రూ. 12000 ఇస్తామని హామీ ఇచ్చిన ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. రోజు కూలి చేసుకునే ఉపాధి హామీ కూలీలకు ఇంకా నెలరోజుల వేతనం ఇంకా పెండింగ్ ఉందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆర్గారంటీలను అరకొరగా అమలు చేస్తోందని విమర్శించారు. పేదలకు వ్యవసాయ భూమే గ్యారెంటీ అని దాన్ని అమలు చేయాలని కోరారు. హామీ ఇచ్చిన మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, రైతుబంధు తదితర పథకాలు అమలు చేయకపోవడం వల్లే కేసీఆర్ను ప్రజలు ఓడించాలని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయ కార్మికులు గ్రామ గ్రామాన వ్యవసాయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొని హక్కుల కోసం పోరాడాలి అన్నారు రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా 28 జిల్లాలో జిల్లా కమిటీలు, వందలాది మండల కమిటీలు ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి నాలుగు లక్షల సభ్యత్వం చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మూడో మహాసభలు, వనపర్తి జిల్లా మహాసభ త్వరలో జరుగుతుందన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జె. చంద్రయ్య, అబ్రహం, నాయకులు శ్రీరామ్, రమేష్, గోపాలకృష్ణ, చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.(Story:వ్యవసాయకార్మికుల బతుకులకుఅసలు భద్రత భూమి : కలకొండ కాంతయ్య)