పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి
మొక్కలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదనం ,- పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీల్లో పరిశుభ్రత, మొక్కలు ఆటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి పిలుపునిచ్చారు. ఆగష్టు 5 నుండి 9 వ తేది వరకు 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకొవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అన్నారు.
33 శాతంగా ఉండాల్సిన అటవీ చెట్లు కొట్టేయడం వల్ల గణనీయంగా పడిపోయింది అన్నారు. తద్వారా వన్స్పర్తి జిల్లాలో సరైన వర్షాలు పడటం లేదని చెప్పారు. పశ్చిమ కనుమల్లో అటవీ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణ నది ప్రవాహం వస్తుందన్నారు. నల్లమల అటవీప్రాంతంలో చాల వరకు చెట్లు నరికివేయడం వల్ల ఇక్కడ వర్షాలు లేవన్నారు.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో స్వచ్చదనంతో పాటు విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలనే ఉద్దేశ్యంతో 5 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని షెడ్యూల్ వారీగా రోజుకో కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి పెట్టీ 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుందన్నారు. ప్రజలు సైతం తమ ఇళ్ళలో, పరిసరాల్లో పరిశుభ్రం చేసుకొని స్థలం ఉన్న ప్రతిచోటా మొక్కలు నాటాలని తద్వారా జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, జిల్లా అధికారులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, మహిళా సమాఖ్య సభ్యులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. (Story : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి)