కాలానుగుణ వ్యాధులకు దోమల ప్రధాన కారణం
కమిషనర్ ఎంఎం నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం: విజయనగరం కాలానుగుణ వ్యాధులకు దోమలే ప్రధాన కారణమని, వాటి నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కాటవీధి తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో దోమలు వృద్ధి కాకుండా చూడాలని ప్రజలను కోరారు. నిరంతరం దోమల నియంత్రణకు తాము అన్ని విధాలా చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు కూడా సహకరించి దోమల వృద్ధి కేంద్రాలు లేకుండా చూడాలన్నారు. ప్రధానంగా నీటి నిల్వలు లేకుండా ప్రతిరోజు శుభ్రపరచుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న టిఫిన్ దుకాణాల వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే కాటవీధి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే దోమలు వల్ల సంక్రమించే రోగాల గురించి తెలుసుకోవాలన్నారు. నేటి నుండి విద్యార్థులు తమ ఇళ్లల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని పరిశుభ్రపరచుకోవాలని సూచించారు. నిరుపయోగంగా పడి ఉన్న టైర్లలో, కొబ్బరి చిప్పలలో, గుంతలలో, ఎయిర్ కూలర్లలో ఎక్కువగా నీరు నిల్వ ఉండిపోతుందని అవే దోమలకు వృద్ధి కేంద్రాలుగా నిలుస్తున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనేక చోట్ల నీరు నిల్వ ఉంటుందని వాటిని పరిశుభ్రపరుచుకోవాలని చెప్పారు. వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని అయితే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు వ్యర్ధనీటిని ప్రక్షాళన చేయాలని చెప్పారు. దోమలు వృద్ధి కాకుండా తాము కుంటలలో, చెరువులలో ఇప్పటికే ఆయిల్ బాల్స్ వేసామని, అలాగే యాంటీ లార్వా ఆపరేషన్ ను ముమ్మరం చేసామని చెప్పారు. అనేక ప్రాంతాలలో ఫాగింగ్ యంత్రాలతో దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ దోమతెరలు తప్పనిసరిగా వాడుకోవాలని అన్నారు. చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండి దోమలు దరిచేరకుండా చూడాలన్నారు. అనారోగ్యం గురైన వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో పారిశుధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు పాల్గొన్నారు. (Story : కాలానుగుణ వ్యాధులకు దోమల ప్రధాన కారణం)