కూతురు శవంతో 10కిలోమీటర్లు…!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రమంటేనే నేటికీ ఎన్నో గ్రామాలు ప్రాతిపదిక సౌకర్యాలకు దూరంగా వున్న రాష్ట్రంగా భావిస్తారు. ప్రభుత్వాసుపత్రులు మన రాష్ట్రం కన్నా దయనీయమైన పరిస్థితుల్లో వుంటాయి. అంబులెన్స్‌లు కూడా అందుబాటులో వుండవు. శవాలను ఎడ్లబండిపైన, లేదా డోలీలపైనా, ఒక్కోసారి కర్రలు కట్టుకొని భుజాలపై మోసుకుపోయే దౌర్భాగ్యపరిస్థితి వుంటుంది. తాజాగా ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాన మోసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన హృదయ విదారక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో కన్పించింది. సుర్గుజా జిల్లాలో అంబికాపూర్‌కు సమీపంలోని అందాలా గ్రామవాసి ఈశ్వర్‌దాస్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఏడేళ్ల కుమార్తె భౌతికకాయాన్ని భుజాన వేసుకొని పయనించిన ఘటన కంటనీరుతెప్పించింది. ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయిన్పటికీ తగ్గకపోవడంతో శుక్రవారం లఖాన్‌పుర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయులు 60కి పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. ఆ పాప చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. చివరకు చేసేదిలేక ఈశ్వర్ దాస్ కుమార్తె మృతదేహాన్ని భుజాన మోసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్లారు. రోడ్డుపై ఈశ్వర్ నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు తీసిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశించారు. కాకపోతే ఎప్పటిలాగానే ఆసుపత్రి అధికారులు బాధితులపైనే నిందమోపి చేతులు దులుపుకున్నారు. తాము చెప్పినా వినకుండా ఈశ్వర్ ఆ శవాన్ని మోసుకెళ్లాడని ఆరోపించారు. ఈ సర్కారీ దవాఖానాలు మారవు…అందులో పనిచేసే డాక్టర్ బాబులూ మారరు! (Story: కూతురు శవంతో 10కిలోమీటర్లు…!)
See Also: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!