UA-35385725-1 UA-35385725-1

ఎటో వెళ్లిపోయింది…పాట!

పాట-పరాయీకరణ

– వేల్పుల నారాయణ

కవితా పరిణామ క్రమంలో పాట ఒక ప్రక్రియగా అభివృద్ధి చెందింది. సామూహిక జనావేశం, సంగీతం, కవిత్వం సమపాళ్లలో వున్న ప్రజాభ్యుదయ పాటలు, నాలుగు కాలాల పాటు బతుకుతాయి.
సమస్యల పరిష్కారం కోసం, సుఖమయ జీవితం కోసం, సమసమాజ నిర్మాణం కోసం వివిధ శ్రేణులు వేర్వేరుగా పోరాటాలు చేస్తున్నాయి, చైతన్యవంతమవుతున్నాయి, ఉద్యమిస్తున్నాయి. ఈ ప్రజోద్యమాల ప్రభావం విధిగా సాహిత్య ప్రక్రియలన్నింటిపై పడుతుంది. మరోవైపు ప్రతిఘాతుక, ప్రగతి నిరోధక ఉద్యమశక్తులు కూడా అన్ని కాలాల్లో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాయి. ఫలితంగా ప్రజల్లో కూడా విభిన్న శిబిరాలు, విభిన్న వైఖరులు ఏర్పడి ఐక్యతకు విఘాతం కలుగుతూనే వుంటుంది. ఈ ప్రభావం కూడా సాహిత్య ప్రక్రియలన్నింటిపై విధిగా పడుతుంది. పాటలపై కూడా ఈ రెండిరటి ప్రభావం పడడం వల్ల ప్రగతిశీల పాటలు, ప్రగతి నిరోధక పాటలు రెండూ కూడా ఏకకాలంలో వస్తూనే వుంటాయి. కాకపోతే సామాజిక అస్థిత్వ చైతన్యాన్ని బట్టి వాటి ప్రభావాల హెచ్చుతగ్గులుంటాయి, ఆదరణ, విలువలు వుంటాయి.
ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రగతి నిరోధక పాటలే పరాయీకరణకు లోనై రకరకాల అస్థిత్వ ధోరణుల్లో చొరబడి తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. అందువల్లనే ఇటీవల కొందరు రచయితలు, గాయకులు పాటల స్థాయి దిగజారుతుందని, బిక్షమెత్తుకునే స్థితికి పడిపోతుందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
కవి, కళాకారుడు, గాయకుడు, నటుడు మనిషనుకున్నవారెవరైనా సరే తను ఒక సామాజిక జీవి అనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని సామాజిక బాధ్యతలను కూడా నెరవేర్చాల్సి వుంటుంది.
తన ఉనికికి కారణమైన సమాజాన్ని మరింత ఉన్నతంగా సుఖ సంతోషాలను పంచిపెట్టే ఉత్తమ విలువలతో కూడిన అభ్యుదయ వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన అవసరముంది. అంటే తనకోసమే గాకుండా తన చుట్టూ వున్న సమాజం కోసం సామాజిక స్పృహ కలిగిన సాహిత్యాన్ని, కళలను, కళా ప్రదర్శనలను ఒక సజీవ చైతన్యదీప్తిగా కొనసాగించాల్సిన అవసరముంది, సంరక్షించాల్సిన అవసరముంది.తద్వారా సామాజిక అస్థిత్వంలో భాగమైన తన అస్థిత్వాన్ని కూడా కాపాడుకోగలడు.
ఒకప్పుడు రాజులను కీర్తిస్తూ, రాణుల అందాలను పొగిడేస్తూ కళలను, కవిత్వాలను రాజావాసాలకు అర్పించారు. రాజరికమే కేంద్ర బిందువుగా సాహిత్య సృష్టి జరిగింది. కళా ప్రదర్శన కొనసాగింది. అనంతర పరిణామ క్రమంలో సామాజిక సంస్కరణలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో భాగంగా ప్రజలే కేంద్రబిందువుగా ప్రజా, అభ్యుదయ సాహిత్యం వచ్చింది. ప్రజల కష్టాలు, నష్టాలు, సుఖాలు, దు:ఖాలు, పీడనలు, జీవనరీతులు, వైవిధ్యాలు ఇవన్నీ నిజమైన సాహిత్య వస్తువులైనాయి. సామాజిక చలనంలో రచయితలు పాత్రధారులై మరింత వున్నత సమాజం సృష్టికి దాన్ని వేగవంతం చేశారు.
కానీ ఇప్పుడు పెట్టుబడి కేంద్రబిందువుగా మారిన తర్వాత సామాజిక విలువల స్థానాన్ని మార్కెట్‌ విలువలు ఆక్రమించాయి. ప్రపంచీకరణ ముసుగు తగిలించుకున్న పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచవ్యాపితంగా మార్కెట్‌ కోసం వలసలను సృష్టించుకొని వలస సమాజాలను ఏర్పాటు చేస్తుంది. తన ఆర్థిక సూత్రాల నియంత్రణలో అభివృద్ధి మాయాజాలాన్ని గుప్పిస్తూ ఆకాశ హర్మ్యాలను ఒకవైపు, నేలనంటుకొని అల్లాడే అట్టడుగు జీవితాలను మరోవైపు పెంచిపోషిస్తుంది. ఫలితంగా ఉనికిలో వున్న ప్రతీది సరకుగా పరిణామం చెందే దుర్మార్గమైన కుట్ర విస్తరిస్తుంది. అందులో భాగంగానే ఈనాడు సంస్కృతి కూడా ఒక సరుకుగా మారిపోయింది. ఇప్పుడు సంస్కృతి ఎంతమాత్రం జీవన విధానం కాదు. ఈనాడు అది జీవితానికి ఒక సంపాదన మాత్రమే.
సంస్కృతి అంటే మన జీవన విధానం. అంటే మన ఆచార వ్యవహారాలు, అలవాట్లు, సంప్రదాయాలు, విలువలు, నీతి నియమాలు, భాషా, సాహిత్యం, కళలు, మానవ సంబంధాలు తదితర అనేక అంశాలు ఇమిడివున్నాయి. వీటన్నింటిని కూడా వ్యాపారీకరణ చేయడమే సామ్రాజ్యవాద సంస్కృతి ప్రధాన లక్ష్యం.
వలసవాదానంతర సమాజాల సంస్కృతిపైన ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాద రాజకీయ, ఆర్థిక దోరణుల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా ఆయా భాషలపై, సాహిత్యాలపై దాడి మొదలైంది. ఇంగ్లీషు ఒక్కటే ప్రపంచ భాషగా అందలాలకెక్కించబడిరది. రచయితలు కీర్తి కిరిటాలు లేదా పాపులారిటి అనే నిచ్చెనమెట్లు ఎక్కడం, పడిపోవడం కూడా జరుగుతుంది.
గ్లోబల్‌ పెట్టుబడి ప్రవేశించిన తరువాత మన పండుగలు, వేడుకలు తదితర సంస్కృతి విభాగాల స్థానాల్లో మదర్స్‌డేలు, ఫాదర్స్‌డేలు, వాలెంటైన్‌ డే లు తదితర పశ్చిమ దేశాల సంస్కృతులు చొరబడ్డాయి. ఇవి ఈనాడు మన పండుగలను, వేడుకలను హరించే సంస్కృతులుగా విషమిస్తున్నాయి. సినిమా హాళ్ళు, రెస్టారెంట్‌లు, పబ్‌లు, సంగీత కంపెనీలు, గ్రీటింగ్‌ కార్డులు అన్నీ కూడా ఈ సంప్రదాయాన్ని విస్తృత పరుస్తూ టీనేజ్‌ జీవితాన్ని మార్కెట్‌ సంస్కృతిలోకి లాగడానికి కుట్ర చేస్తున్నాయి. అందులో పాటలు, ఆటలు, నృత్యాలు వినోద సరుకులై విహరిస్తున్నాయి.
పెట్టుబడి శక్తులు కేవలం మన సంస్కతిలోకి మాత్రమే చొరబడలేదు, అవి మన ఆలోచనలు, అలవాట్లు విలువలతో కూడిన విధానాల్లోకి చొరబడి ఒక కొత్త మానవ ప్రవర్తను సృష్టించి వినియోగ సంస్కృతిని రుద్దుతున్నాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం, కళా, సినిమా, నాటక రంగాల్లో మునుపెన్నడు లేని వినిమయ మార్కెట్‌ సంస్కృతిని ఆవిష్కరించి తీసుకువచ్చాయి. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జనాలను విపరీతంగా ఆకర్షిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంస్కృతి పెట్టుబడిగా మారిపోయింది.
ప్రపంచ సాంస్కృతిక విధానం మనదేశంలో ఇప్పటికే స్థరీకరించబడిన సమాజం పైన కుల, మత, వర్గ ఎలైట్‌ సంస్కృతిని పెంచి వ్యత్యాసాలను అభివృద్ధి చేస్తుంది. కుల, మత, ప్రాంతీయ అస్థిత్వాలను పెంచి పోషిస్తూ ఒక నూతన, ఆర్థిక రాజకీయ వ్యవస్థను తీసుకు వస్తుంది. తిరిగి అస్తిత్వాల మధ్య అంతర్గత వైరుధ్యాలను, సమస్యలను సృష్టిస్తూ సమస్యలపై అలజడిని ప్రేరేపిస్తుంది. అందులో అస్థిత్వ నాయకులను సృష్టించి వారిని తన పాలసీకి కాపాలాదారులుగా చేసుకుంటూ వారికి తమ ప్రయోజనాలను కల్పిస్తుంది. ఫలితంగా అస్థిత్వ వాదంలో నడిచే, ప్రజలు ఇంకా దోపిడికి గురవుతు అట్టడుగుకు వెళుతుండగా, దాని ముఖ్య నాయకులు మాత్రం అభివృద్ధి అందలాలపై ఊరేగుతున్నారు. ఐక్యత అనే ఆయుధాన్ని ముక్కలు చేసే కుట్రలు ప్రపంచీకరణలో భాగంగా కొనసాగుతున్నాయి. సమస్యల సాలెగూడులో మనిషిని బంధించి తద్వారా తనకనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంటుంది.
ఈ నేపధ్యంలో మనిషి పరాయీకరణ చెందుతున్నాడు. మనిషి పరాయీకరణ చెందడమంటే అతనిలో వున్న సమస్తం పరాయీకరణ చెందినట్లే. అతనిలోని సాహిత్యం, కళా సృజన, వ్యక్తిత్వం, ఉన్నత భావాలు కూడా పరాయీకరణ చెందుతాయి. ఫలితంగా పాట, దానితో పాటు గాయకుడు కూడా పరాయీకరణ చెందుతున్నాడు. అసలైన ఆశయాలు, లక్ష్యాలు ఆవిరైపోగా డబ్బు సంపాదన ఒక్కటే ధ్యేయంగా, డబ్బు సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆశయాలు లక్ష్యాలుగా మారుతున్నాయి. అందుకే రకరకాల వేదికలపై కవులు, కళాకారులు,గాయకులు ప్రత్యక్షమవుతున్నారు.
పాట ఒక చైతన్య స్రవంతి. ఒక పరిగెత్తే ప్రవాహం, ఒక సాహితీ సమరాంగనం, ఒక వశీకరణ శక్తి, ఒక ఉద్యమానికి వజ్రాయుధం, ఒక నిరుపేదల సేదతీర్పు, ఒక తల్లిపాల ప్రబలశక్తి, ఒక వృత్తిజనుల వృత్తాంతం, ఒక జాతి జనుల జానపదం, ఒక సకలజనుల సంగీతం. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన, నిబద్దత కలిగిన రచయితలు, కళాకారులు వారు సృష్టించిన ఇలాంటి పాటలు, కళలు, సాహిత్యం మినహా అందరూ ఈ పరాయీకరణ మాయాజాలంలో కొట్టుకొనిపోతున్నారు. అందువల్ల పాట పరాయీకరణ చెందుతూనే దాని అస్థిత్వాన్ని కోల్పోతుంది. అస్థిత్వం కోల్పోవడమంటే దానిలో అంతర్భాగంగా వున్న సామాజిక విలువలు, సాహిత్య విలువల స్థానంలో మార్కెట్‌ విలువలు ప్రవేశించడమే. మార్కెట్‌ విలువలు ప్రవేశించాయంటే పాట ఒక సరుకుగా మారిపోవడమే. సరుకుగా మారిపోయిన ఒక్కోపాటకి ఒక్కోధర వుంటుంది. ఒకొక్క కళాకారుడికి ఒక్కొక్క ధర వుంటుంది. ధరను నిర్ణయించేది మార్కెట్‌ శక్తులు. పాటలో, గాయకుడిలో సామాజిక, సాహిత్య విలువలకు బదులు తన పాట, ఆట ద్వారా ఏ మేరకు సంపాదించగలరనే విలువపైనే గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు తగిలించబడడం జరుగుతుంది. ఒకప్పుడు పాటలు రాసే రచయితలు వేరు, పాటలు పాడే గాయకులు వేరే వారై వుండేవారు. వారి సాహిత్యంలో శబ్ద సౌందర్యం, పదాల పరిమితి, వాటి పొందిక, వాటి గతులు, అర్థ సరళత, పరుగెత్తే చైతన్యం, భాషా సంపద, వస్తుసంపద, తాత్విక నిబద్దత వుండేవి. కానీ ఈనాడు అవేవీ లేకుండా గద్యాన్నే పద్యంగా, మాటనే పాటగా ఏదో ఒక రాగంలో ఆ క్షణంలో ప్రజలను ఆకర్షించే గాయకులే కవులుగా అవతారమెత్తే వాగ్గేయకారులు అనేక మంది పుట్టుకొచ్చారు. అందువల్ల పాట నినాదప్రాయమై పోయింది.

Velpula Narayana
Velpula Narayana

వీధుల వెంట బిచ్చమెత్తుకునే విధంగా వివిధ మార్కెట్‌ల చుట్టూ బిక్షమెత్తుకునే స్థాయికి దిగజార్చబడుతుంది. అందువల్లనే సాహిత్య విలువలు, సామాజిక విలువలు లేని అనేక మంది గాయకులు పాటలు రాస్తూ, ఆటలు ఆడుతూ ప్రదర్శనలిస్తూ ఆయా వ్యాపార సంస్థలకు, బూర్జువా రాజకీయ వేదికలకు ప్యాకేజీ కళాకారులుగా మారిపోతున్నారు. సమాజాన్ని, సామాజిక విలువలను నమ్ముకునే బదులు మార్కెట్‌ మహాతల్లిని నమ్ముకుంటే అవకాశం కలిసొస్తే అందలాలు ఎక్కవచ్చు అనుకునేవారు కొందరైతే, బ్రతుకుదెరువుకోసం అందులోకి తప్పనిసరి పరిస్థితిలో లాగబడ్డవారు మరికొందరు. ఈ నేపధ్యంలోనే ఈనాడు పాటను, గాయకుడిని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఏ అస్థిత్వానికి కొట్టుకొని పోకుండా సామాజిక స్పృహతో వెలువడే నిబద్ధత గల సాహిత్యం, కవులు, వారి పాటలు ఎవరికీ తలవంచకుండా జనం గుండెల్లో గూడుకట్టుకోగా, మార్కెట్‌ మాయాజాలంలో పడిపోయిన కవులు, గాయకులు వారి పాటలు మాత్రమే ప్యాకేజి పాటలుగా, ప్యాకేజి కళాకారులుగా బిక్షాటన స్థాయికి దిగజారిపోతున్నారు.
ఈ పరిణామానికి మూల కారణమైన పెట్టుబడిదారి ప్రపంచీకరణ, దాని కుట్రలు అర్థం చేసుకోకుండా పాటను, గాయకులను అంచనావేయడం మంచిదికాదు. అన్నింటిని ఒకే ఘాట కట్టడం కూడా సమంజసం కాదు. రకరకాల అస్థిత్వ వాదాలను సృష్టిస్తున్న పెట్టుబడిదారి ప్రపంచీకరణ సంస్కృతి భ్రమలో పడి ఎవరికి వారే అస్తిత్వవాదులుగా వేరుపడి వైరుధ్యాలను పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనం పెట్టుబడిదారుడికి మాత్రమే. పెట్టుబడిదారి సంస్కృతికి మాత్రమే. దీన్ని ప్రతి వారు గ్రహించాల్సిన అవసరముంది. భిన్న అస్థిత్వాలన్నీ కూడా సామాజిక అస్థిత్వంలో అంతర్భాగంగా ఉంటూ ఉమ్మడి శత్రువుపై యుద్ధం చేయాల్సిన అవసరముంది. అప్పుడే పాటను పరాయీకరణ చెందకుండా, దిగజారిపోకుండా నిరోధించుకోగలం. (Story: ఎటో వెళ్లిపోయింది…పాట!)

See Also: గోర్కి-జీవితం-సాహిత్యం

సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ

నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1