రానున్న అయిదు రోజులు వర్షాలు పడే అవకాశం
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
న్యూస్తెలుగు / వనపర్తి : రానున్న అయిదు రోజులు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ధరణి, ఎల్.ఆర్.ఎస్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యి కలెక్టర్లకు సూచనలు చేశారు.
రానున్న అయిదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడా ప్రాణ ఆస్థి నష్టాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు. ఎల్.ఆర్.ఎస్.లో చేసుకున్న దరఖాస్తులు, ధరణి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలు పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు సమన్వయంతో పని చేసి వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ప్రతిరోజు మురుగు కాలువలు శుభ్రం చేయడం, రోడ్ల పైన ఉన్న గుంతలను పూడ్పించడం, శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అందులో నివసిస్తున్న వారికి నోటీసులు ఇచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. పాత వంగిన విద్యుత్ స్తంభాలు ఉంటే మార్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లు వాటికి ఉన్న సెల్లార్ ను వాహనాల పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైనా సెల్లార్ ను ఇతర అవసరాలకు ఉపయోగిస్తుంటే భారీగా జరిమానాలు విధించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ లో దరఖాస్తు చేసుకున్న వాటిని రెగ్యులరైజ్ చేసే విధంగా యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, డి.పి. ఒ ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దోమల నివారణకు చర్యలతో పాటు జ్వరం వస్తున్న అనుమానిత వ్యక్తుల నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయించాలన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి కేసులు ఎక్కడ నమోదైన ప్రబల కుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ధరణి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని శక్షేశన్, మ్యూటేషన్ వంటివి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆర్డీఓ పద్మావతి, జడ్పి సి. ఈ ఓ యాదయ్య, విద్యుత్ శాఖ ఎస్. ఈ రాజశేఖరం, డి. ఈ శ్రీనివాస్, డి.పి ఓ రమణ మూర్తి, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, కొత్తకొత్త మున్సిపల్ కమిషనర్ సూర్యకుమార్, తదితరులు పాల్గొన్నారు. (Story : రానున్న అయిదు రోజులు వర్షాలు పడే అవకాశం)