ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి
తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
మంగళవారం ఆచార్య జయశంకర్ 90వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, అదనపు కలక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని, ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడారని వారి సేవలు మరువలేనివని అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి)