గంజాయి అక్రమ రవాణ కేసులో 7గురు అరెస్టు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా రాజాం పోలీసు స్టేషను పరిధిలో గంజాయి అక్రమంగా కలిగి, రవాణకు పాల్పడుతున్న మరియు వినియోగిస్తున్న 7గురు నిందితులను అరెస్టు చేయడంతోపాటు, వారికి సహకరిస్తున్న ఒక జ్యువినల్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో జూలై 30న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – రాజాం పట్టణంలో జూలై 29న ముగ్గురు వ్యక్తులు గంజాయిని ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్లో కొనుగోలు చేసి, రాజాం నుండి చిలకపాలెం వైపు అక్రమంగా రవాణ చేస్తూ అంతకాపల్లి గ్రామ జంక్షన్ వద్ద రాజాం పోలీసులకు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన ముగ్గురిలో (ఎ-1) కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్, ములగూడ గ్రామానికి చెందిన సలవు పంగి (24సం.లు) గంజాయిని కోరాపుట్ నుండి తీసుకొని బైకుపై రాజాం రాగా, అతని వద్ద (ఎ-2) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన బొద్దాన సౌమిత్ (28 సం.లు) (ఎ-3) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన ముద్దాడ వెంకటేష్ అలియాస్ వెంకీ కొనుగోలు చేస్తుండగా రాజాం పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి 10,825 కిలోలు బరువు కలిగి, రూ.2 లక్షల విలువైన గంజాయిని, ఒక పల్సర్ బైకు, మూడు సెల్ ఫోన్లును రాజాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు (ఎ-4) రాజాం పట్టణంకు చెందిన కసిన శ్రీధర్ (29 సం.లు) (ఎ-5) చిప్పాడ అరుణ్ కుమార్ (27సం.లు) (ఎ-6) జక్కం దీపక్ (23 సం.లు) (ఎ-7) రేగిడి ఆమదాలవలస మండలం/ గ్రామానికి చెందిన దంగల మణికంఠలను వీరితోపాటు మరో జ్యువినల్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. ఎ-1 నుండి ఎ-3 ముద్దాయిలు ఒడిస్సా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి, చిన్న చిన్న పొట్లాలుగా చేసి గంజాయి అలవాటు ఉన్న వారికి విక్రయిస్తుంటారన్నారు. అదే విధంగా ఎ-4 నుండి ఎ-7 మరియు జ్యువినల్ గంజాయిని సేవించడం అలవాటుగా ఉన్నట్లుగా గుర్తించి, వారికి కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి కలిగివున్న, సేవించినా, రవాణకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని, వారిపై ఎన్.డి.పి.ఎన్. చట్టం ప్రకారంకేసులు నమోదు చేస్తామన్నారు. ఈ తరహా గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి, వారి కదలికలపై నిఘా పెడతామన్నారు. అదే విధంగా గంజాయి అక్రమ రవాణకు తరుచూ పాల్పడి, పట్టుబడితే వారిపై పిడి చట్టం కూడా ప్రయోగిస్తామని, గంజాయి అక్రమ రవాణాదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. గంజాయి నియంత్రణలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసామని, ఈ బృందం గంజాయి అక్రమ రవాణ, విక్రయించే వారి, వినియోగించే వారి సమాచారాన్ని సేకరించి, వారిని అదుపులోకి తీసుకొని, సంబంధిత పోలీసులకు అప్పగిస్తారన్నారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణలో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలో ప్రవేసించేందుకు ఆస్కారం ఉన్న 15 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించేందుకు త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారుచేసి, విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గంజాయి సేవించడం ఒకసారి అలవాటైతే త్వరితగతిన గంజాయిని సేవించేందుకు బాసినగా మారుతారని, విలువైన జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకొనే అవకాశం, త్వరతగతన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నందున యువత గంజాయి, ఇతర మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. అదే విధంగా గంజాయి గురించిన సమాచారం ఉంటే 9121109416 కు ప్రజలను కోరారు.గంజాయి రవాణ, విక్రయాలు, సేవించడాలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పటికే కొత్తవలస, విజయనగరం వన్ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లులో గంజాయి కేసులను నమోదు చేసి, గంజాయిని సీజ్ చేయడంతోపాటు, అందుకు కారకులైన ప్రధాన నిందితులను కూడా అరెస్టు చేస్తున్నామని తెలిపారు. కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, రాజాం ఇన్స్పెక్టరు డి.మోహనరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఈ నర్సింహమూర్తి, రాజాం ఎస్ఐ రవి కిరణ్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : గంజాయి అక్రమ రవాణ కేసులో 7గురు అరెస్టు )