మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్ప రధంతో ప్రచారం
న్యూస్ తెలుగు/విజయనగరం : మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను యువతకు వివరించి, వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంచేసేందుకు జిలా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమానికి యువత నుండి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.
ఈ ‘సంకల్పం’ కార్యక్రమాన్ని యువతతోపాటు డ్రగ్స్ అలవాటు ఉన్న ఇతర వ్యక్తులు, ప్రజలకు మరింత చేరువ చేసి, వారిని అలవాట్లకు దూరం చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి ప్రత్యేకంగా ‘సంకల్ప రధం’ ను రూపొందించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సంకల్ప రధంతో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని వచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా రోజూ సాయంత్రం ఒక ముఖ్య కూడలిలో వాహనాన్ని నిలిపి, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించనున్నామన్నారు.
ప్రజలకు సంకల్పం కార్యక్రమ ఉద్ధేశ్యాన్ని తెలియపర్చి, మత్తు, మాదక ద్రవ్యాల అలవాటుకు ప్రజలను దూరం చేసేందుకు అవగాహన కల్పించడమే ప్రధానమని జిల్లా ఎస్పీ భావించారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలును సందర్శించి, విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ, వారిని ఆలోచింపజేసే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించి, మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు.
ఇదే విధంగా విద్యార్థులతోపాటు ప్రజలను కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యపర్చేందుకు ‘సంకల్ప రధం’ను పట్టణంలోని తోటపాలెం కళాశాల వద్ద నిలిపి, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, మాదక ద్రవ్యాల వినియోగం వలన తమ జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా చిత్రం అవుతున్నాయో వివరిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించి, ప్రజలు, యువతకు అవగాహన కల్పించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐలు ప్రసన్న కుమార్, కిరణ్ కుమార్ నాయుడు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.(Story : మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్ప రధంతో ప్రచారం )