ర్యాగింగ్ అనేది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది
న్యూస్ తెలుగు\వనపర్తి : ర్యాగింగ్ అనేది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, విద్యార్థులు ఎవరు అటువంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల చెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన జిల్లా యాంటీ ర్యాగింగ్ కమిటీ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థుల జీవితాల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. కాబట్టి ఎవరు ర్యాగింగ్ జోలికి పోకూడదని అన్నారు. మానసికంగానూ, శారీరకంగానూ జూనియర్లను గాని తోటి వారిని గాని వేధించడం రాగింగ్ కిందకి వస్తుందని, అటువంటి చర్యలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సూచించారు. వైద్యవృత్తికి మంచి గౌరవం ఉంటుందని ఎవరు ర్యాగింగ్ వంటి వాటి జోలికి పోకుండా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలన్నారు. ప్రభుత్వం వైద్య విద్యార్థుల కోసం ఎంతో వెచ్చిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ర్యాగింగ్ అనేది భవిష్యత్తును నాశనం చేస్తుందని, అందులో ఎవరు తలదూర్చావొద్దని చెప్పారు. కళాశాలలో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు గురైనట్లయితే వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులు తాము డిప్రెషన్ కు గురైనట్లు భావిస్తే 14416 టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించాలన్నారు. ఎస్పీ గిరిధర్ రావుల మాట్లాడుతూ ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఎవరు ర్యాగింగ్ వంటి వాటిల్లో తలదూర్చవద్దని చెప్పారు. మంచి వారితోనే స్నేహం చేయాలని, చెడు ఉద్దేశాలు ఉన్నవారితో స్నేహం చేయవద్దని చెప్పారు. వైద్యవృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని, ప్రతి బాగా చదివి సొసైటీ కి మేలు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దని సూచించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల వనపర్తి లో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆక్టివ్ గా ఉందని, ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు గురైతే కమిటీలో ఫిర్యాదు చేయడం ద్వారా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అదేవిధంగా ప్రిన్సిపల్ పేషి లోను కంప్లైంట్ బాక్స్ ఉంచినట్లు చెప్పారు. అందరి వద్ద ప్రిన్సిపల్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్న మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించారు. మహిళా శక్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న మహిళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునందిని, తాసిల్దార్ రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.(Story :ర్యాగింగ్ అనేది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది)