ధాన్యం కొనుగోలు కాక రైతుల కష్టాలు : సిపిఐ
న్యూస్తెలుగు/ వనపర్తి : కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ధాన్యం కొనక రైతులు కష్టాలు పడుతున్నారని, వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ అనుబంధ భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ డిమాండ్ చేశారు. బుధవారం పానగల్ మండలం కేతేపల్లి రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. కేతేపల్లి ధాన్యం కేంద్రంలో ఒడ్లు పోసి 25 రోజులు అవుతున్నా పలకరించే నాథుడు లేరన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు కిందపరిచే పడాల ను అద్దెకు తెచ్చుకున్నారని వాటి అద్దె పెరిగిపోతుందన్నారు. రోజు వొడ్లను ఆరబెట్టటం , వర్షం చినుకులు పడటంతో మళ్లీ కుప్పలు చేస్తున్నడంతో చేతులకు బొబ్బలు వచ్చాయని పలువురు రైతులు చేతులను చూపారన్నారు. మంగళవారంరాత్రి వర్షం పడితే నిద్ర లేకుండా కుప్పలు కట్టామని చెప్పారన్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. శ్రీరంగాపురం వనపర్తి ప్రాంతాల నుంచి బాయిల్డ్ రైస్ మిల్లర్లు కొనుగోలుకు వచ్చారని, ఆలస్యమైతే తక్కువకైన అమ్ముతామని వారుచెప్పారన్నారు.వర్షం వస్తే కప్పేందుకు టార్పల్లిండ్లు ఇస్తున్నామని అధికారులుచెబుతున్నా ఎక్కడ ఒక్క టోర్ఫలిన్ ఇవ్వలేదన్నారు. కేంద్రం వద్ద నీడ కోసం టెంట్లు లేక, ఎండకుమాడుతున్నారన్నారు. తాగునీటి వసతి లేదన్నారు. అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులతో ధాన్యం కేంద్రాల వద్ద ధర్నా, రోడ్లపై రాస్తారోకో చేస్తామన్నారు. సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మాజీ గ్రామ శాఖ కార్యదర్శి అంజి, సీనియర్ నాయకులు కాకం చిన్న నారాయణ, కురువ హనుమంతు, చిన్న కుర్మయ్య, ఎలగొడ్డు రాముడు, నరసింహ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. (Story ; ధాన్యం కొనుగోలు కాక రైతుల కష్టాలు : సిపిఐ)