ఏకో పార్కును సుందరంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి పట్టణంలోని ఏకో పార్కును సుందరంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అటవీ సంరక్షణ, గిరిజనుల పొడు పట్టాల సమస్యలు, రెవెన్యూ, అటవీ శాఖ భూ వివాదాల పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏకో పార్కులో ప్రజలు సేద తీరేందుకు, వ్యాయామం, ఉదయం నడకకు ఓపయోగ పడే విధంగా మౌలిక సదుపాయాలతో పాటు సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని అటవీ శాఖ అధికారిని సూచించారు. సైక్లింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోడు పట్టాల సమస్యలు ఏమున్నాయి అని ఆరా తీయగా పోడు పట్టాలకు గత సంవత్సరం 3214 దరఖాస్తులు చేసుకోగా ఎఫ్.ఆర్.సి ద్వారా 676 దరఖాస్తులు ఆమోదించి జిల్లా కమిటీకి నివేదించగా 311 దరఖాస్తులు జిల్లా కమిటీ ద్వారా ఆమోదించి 364 దరఖాస్తులు తిరస్కరించినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన 2565 ఎఫ్.ఆర్.సి ద్వారా తిరస్కరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాటి దరఖాస్తులు పెండింగ్ లో లేవని అటవీ శాఖ అధికారి వివరించారు. వనపర్తి మండలంలోని దత్తయపల్లి నుండి ముందరి తాండా వరకు, అంజనగి తాండా కు సి.సి. రోడ్డుకు అటవీ శాఖ అనుమతి లభించినట్లు తెలిపారు. కర్నే తాండా, దత్తయ పల్లి, దొంతికుంట తాండా పరిధిలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి స్థలం విషయంలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, షెడ్యూల్డు తెగల సంక్షేమ శాఖ అధికారి సుబ్బా రెడ్డి, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. (Story : ఏకో పార్కును సుందరంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలి)