పచ్చని చెట్లు నరికిన గ్రామాల్లో.. మేము రోడ్లు వేస్తున్నాం
నాలుగు నెలల్లో మేము సాధించిన ప్రగతి ఇదే
పల్లె పండుగ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్
మంత్రి సత్య కుమార్ సహకారంతో ప్రతి గ్రామంలో సమస్యలు తీరుస్తాం
నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకుంటా… మంత్రి సత్య కుమార్
అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తా.. ఎంపీ పార్థసారథి
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కక్షలతో పచ్చని చెట్లను నరికిన గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నామని.. నాలుగు నెలల్లో మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇదేనని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ముదిగుబ్బ మండల కేంద్రం, తాడిమర్రి మండలం ఏకపాదంపల్లి, అలాగే ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, హిందూపురం ఎంపీ బి కే పార్థసారథి, జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి, టిడిపి, బిజెపి, జనసేన నాయకులకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ అరాచక పాలన చూసిన ధర్మవరం ప్రజలు.. ఇప్పుడు అభివృద్ధి పాలన అంటే ఏంటో చూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల చేదు జ్ఞాపకాలను చెరిపివేసి.. గ్రామాల్లో పండుగ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీర్చేందుకు ఇప్పటికే అన్ని ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. మంత్రి సత్య కుమార్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని.. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లేడు బండ ప్రాజెక్టు విషయంలో బాధితులు అందరికీ న్యాయం చేస్తామని శ్రీరామ్ భరోసా ఇచ్చారు. తాడిమర్రి మండలంలో చెట్లు నరికే విష సంస్కృతి మనం చూసామని… దీనిని రూపుమాపేందుకు ప్రతి గ్రామంలోనూ మొక్కల పంపిణీ చేపట్టినట్లు గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే.. మళ్లీ ఇదే గ్రామాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు వివరించారు. మంత్రి సత్య కుమార్ ధర్మవరం అభివృద్ధి విషయంలో ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఉన్నారని.. మనం ఇప్పటికే ఆయన దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లామని.. వాటన్నింటిని పరిష్కరిస్తారన్నారు. మరోవైపు జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారన్నారు. ఆయన వలనే ఈరోజు రాష్ట్రంలో గ్రామాలకు పండుగ వచ్చిందని అన్నారు. మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఇక్కడి ప్రజలు గెలిపించాలని.. వారికి ఏ సమస్య వచ్చినా అది నా సమస్యగా భావిస్తానని అన్నారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలములోని ప్రజలు, ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : పచ్చని చెట్లు నరికిన గ్రామాల్లో.. మేము రోడ్లు వేస్తున్నాం)