వనపర్తి ఉపాధ్యాయునికీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ పద్య సారస్వత పీఠం వారు అందించే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని వనపర్తి పట్టణానికి చెందిన బస్వోజు సుధాకరాచారి అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాదు రవీంద్ర భారతి లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు “ఈనాడు” దినపత్రిక ప్రధాన సంపాదకులు డి.యస్. ప్రసాద్, పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్,ఈ గురుకులం ఐఏఎస్ ఫౌండర్ ఆకెళ్ల రాఘవేంద్ర, దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత వాణిజ్య అధికారి లక్ష్మీనారాయణ, జాతీయ సాహిత్య పరిషత్ జాతీయ అధ్యక్షులు, ప్రముఖ సాహితీ వేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి,పద్య సారస్వత పీఠం అధ్యక్షులు అవుసల భానుప్రకాశ్ గారల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లాలోని విద్యార్థులకు అనేక సందర్భాల్లో సాహిత్య పోటీలు నిర్వహించడం, కవి సమ్మేళనాలు,అష్టావధానాలు నిర్వహించి సాహిత్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను సుధాకరాచారిని పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుధాకరాచారి సుధాశ్రీ అనే కలం పేరుతో పద్య కావ్యాలను వ్రాయడమే కాకుండా పద్యానికి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో పద్యం వ్రాసే వారిని ప్రోత్సహిస్తున్నారు. (Story : వనపర్తి ఉపాధ్యాయునికీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం)