డ్రైనేజి , తాగు నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కార్పొరేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో నున్న మురుగునీటి సమస్య , తాగునీటి సమస్య, విద్యుత్ తదితర అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్ .అంబేద్కర్ ఆదేశించారు. వంద రోజుల, ఏడాది ప్రణాళికలు తయారు చేసినప్పటికీ మున్సిపాలిటీ పరిధి లో అత్యవసరంగా చేపట్టవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయని, వాటిని వెంటనే పరిష్కరించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేసారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో స్థానిక శాసన సభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు తో కలసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ముందుగా శాసన సభ్యులు అదితి మాట్లాడుతూ నగరం లో డ్రైనేజి సమస్య ఎక్కువగా ఉందని ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అదే విధంగా 21, 22 , 23 వార్డు లలో కులాయిలలో బురద నీరు వస్తోందని , మున్సిపల్ పరిధి లో ఉన్న పాఠశాలలలో పారిశుధ్యం , మధ్యాహ్న భోజనం మెరుగుపడాల్సి ఉందని , స్టూడెంట్స్, టీచర్స్ నిష్పతి కూడా తేడా ఉందని , పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, వీధి లైట్లు కొన్ని చోట్ల వెలగడం లేదని అంబటి సత్రం వద్ద డ్రైనేజి , రహదారి , మెడికల్ కళాశాలకు వెళ్ళే దారిలో వద్ద విద్యుత్ లైట్ లు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
కలెక్టర్ స్పందిస్తూ మున్సిపాలిటీ లో మొత్తం డ్రైనేజి వ్యవస్థను అధ్యయనం చేసి ఎక్కడెక్కడ, ఏ మేరకు మరమ్మతులు అవసరం ఉన్నదీ వ్యక్తిగతంగా తనిఖీ నిర్వహించి సోమవారం లోగా ఏక్షన్ ప్లాన్ తో నివేదిక నివ్వాలని మున్సిపల్ కమీషనర్ మల్లయ్య నాయుడుకు ఆదేశించారు. అక్టోబర్ 2 లోగా నగరం లో ఎక్కడా డ్రైనేజి సమస్య లేకుండా పరిష్కరించాలని అన్నారు. నీటి ట్యాంక్ లను ప్రతి 15 రోజులకు ఒక సారి శుభ్ర పరచాలని సూచించారు. మున్సిపల్ అధికారులు వారం లో కనీసం 2 పాఠశాలలను తనిఖీ చేసి మద్యాహ్న భోజన పధకాన్ని , పారిశుధ్యాన్ని తనిఖీ చేయాలనీ డి.ఈ.ఓ ప్రేమ కుమార్ కు ఆదేశించారు. డ్రైనేజి ల పై నున్న ఆక్రమణల వలనే మురుగు ప్రవహిస్తోందని, ఆక్రమణలను తొలగించాలని శాసన సభ్యులు కోరగా వెంటనే ఆక్రమణలు గుర్తించి తొలగించాలని కలెక్టర్ కమీషనర్ కు ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ కోసం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం తో చేపట్టాలని, అందుకు తగు ప్లాన్ చేయాలనీ కలెక్టర్ తెలిపారు. అంబటి సత్రం వద్ద నున్న ఎలక్ట్రికల్ పోల్స్ తొలగించాలని, ఎలక్ట్రికల్ ఎస్.ఈ లక్ష్మణ రావు కు తెలిపారు. డ్రైనేజి వెంటనే నిర్మించాలని ఆర్ అండ్ బి ఎస్.ఈ విజయ్ రత్నం కు సూచించారు.
ఈ సమావేశం లో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కొండపల్లి సాంబమూర్తి, పబ్లిక్ హెల్త్ ఈ ఈ దక్షిణా మూర్తి, డి.ఈ అప్పారావు, ఇతర విభాగాల అధికారులు హాజరైనారు . (Story : డ్రైనేజి , తాగు నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి )