గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : మౌలిక వసతుల కల్పనలో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. బొబ్బిలి మండలం గోపాలనాయుడిపేట పంచాయితీ పరిధిలోని సియోనువలస, చిన అక్కివలస, రామన్నదొరవలస, కృపావలస, దీవెన వలస గిరిజన గ్రామాల్లో సుమారు 60 కుటుంబాలు, దత్తిరాజేరు మండలం షికారుగంజి పంచాయితీ పరిధిలోని ఎస్.టీ.కొత్తవలస గ్రామంలో 74 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ గ్రామస్తులు విద్యుత్ సౌకర్యం కావాలని కోరడంతో, సంభందిత శాఖల అధికారులతో కలెక్టర్ తన చాంబర్లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ గ్రామాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటం వల్ల, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా, గ్రామస్తులను ఒప్పించి వేరే చోట వారికి స్థలాలు కేటాయించి, అన్ని వసతులూ సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే సమస్యను ప్రభుత్వానికి కూడా నివేదించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేష్, ఏపీఈపిడిసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి బి.రామానందం తదితరులు పాల్గొన్నారు. (Story : గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం)