ఎన్నో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించాం
ప్రజా వినతుల పరిష్కార కార్యక్రమంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్
కలెక్టర్ కార్యాలయంలో వినతులు స్వీకరించిన మంత్రి
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రాజకీయ యంత్రాంగం, ప్రభుత్వ అధికార యంత్రాంగం కలసి ప్రజా వినతుల కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు సాధించామని రాష్ట్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఎన్నో వినతులకు తక్షణ పరిష్కారం చూపించగలిగామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. వ్యవహారాల మంత్రి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో ఎం.పి. కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జె.సి. కె.కార్తీక్‌లతో కలసి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మంత్రి తమ జిల్లాలో నెలలో రెండు సార్లు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనాలన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో పాల్గొన్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలకు జిల్లాస్థాయిలోనే పరిష్కారం చూపేందుకు ఇది మంచి వేదిక అవుతుందన్నారు. భూసమస్యలపై అధికంగా వినతులు అందాయని మంత్రి చెప్పారు. ఆసుపత్రులకు సంబంధించిన సమస్యలు, ఇతర చిన్నచిన్న సమస్యలపై అక్కడికక్కడే ఆయా సమస్యల పరిష్కారంపై అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఇక్కడ ఏ తరహా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దానిని ముందుకు తీసుకువెళ్లేందుకు గల అవకాశాలు పరిశీలిస్తామన్నారు.
వికసిత జిల్లాగా రూపొందించడంలో అధికారుల సహకారమే ముఖ్యం
అంతకుముందు ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులను ఉద్దేశించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వికసిత్ జిల్లాగా రూపొందించడంలో అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనులు నిర్వహించడంలో ఒక జట్టుగా పనిచేయాలన్నారు. ప్రజా వినతులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులందరి పనితీరుపై పర్యవేక్షణ వుంటుందని చెప్పారు.
వినతుల పరిష్కార వేదికకు 287 వినతులు
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 287 వినతులు అందాయి. రెవిన్యూ సమస్యలపై 182, డి.ఆర్.డి.ఏకు సంబంధించి 31, పంచాయతీరాజ్ శాఖకు 20, మునిసిపల్ శాఖకు 20, విద్యా శాఖ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలకు 9 వంతున, గ్రామ వార్డు సచివాలయాల శాఖకు 6, ఆసుపత్రుల సమన్వయ అధికారికి 5, వైద్య ఆరోగ్యశాఖకు 3, హౌసింగ్ శాఖకు 2 వంతున వినతులు అందాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డి.ఆర్.ఓ. అనిత తదితరులు వినతులు స్వీకరించారు. పలు రెవిన్యూ సంబంధ సమస్యలపై వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధించి జిల్లా కలెక్టర్ డా.అంబేద్కర్ ఆయా రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఆయా వినతులను పరిష్కరించిన అనంతరం రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు, కార్పొరేషన్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
దివ్యాంగుని సమస్యకు తక్షణ పరిష్కారం – వెనువెంటనే వినికిడి పరికరం అందజేత
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఒక దివ్యాంగుడు వినతిపత్రం అందించగా వెంటనే జిల్లా కలెక్టర్ ఆయనకు వినికిడి పరికరాన్ని అందించాలని విభిన్నప్రతిభావంతుల శాఖ ఏ.డి.జగదీష్ ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా వినికడి పరికరాన్ని తక్షణమే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎంపి తదితరులు విభిన్న ప్రతిభావంతుల వద్దకు వెళ్లి వారి నుంచి వినతులు స్వీకరించారు. (Story : ఎన్నో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించాం )