18న వాసవీమాత జయంతి
న్యూస్‌తెలుగు/విజయనగరం: వైశాఖమాస శుక్లపక్ష దశమి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా రెండు రోజులు జయంతి ఉత్సవాలు నిర్వహించబడునని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెళ్లి ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం దేవాలయం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయం గౌరవ అధ్యక్షులు డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు సలహాలు సూచనలుతో , దేవాలయం అధ్యక్షుడు నారాయణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16వ తేదీ శుక్రవారం అమ్మవారికి 108 మంది దంపతులచే అష్టోత్తర శతకలశ ప్రదక్షిణ జరుగునని, శనివారం వాసవీ మాత జయంతి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకంలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి బంగారు చీర, వజ్రకిరీటంతో అలంకరించనున్నట్లు, సాయంత్రం 6 గంటలకు 102 గోత్రాలు కలిగిన అమ్మవారిని తిరువీధుల్లో ఋక్వితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఊరేగించడం జరుగుతుదన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల కరపత్రాలు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పి.ప్రకాష్, రవికుమార్, కట్టమూరి రత్నారావు, వజ్రపు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. (Story: 18న వాసవీమాత జయంతి)