గోర్కి-జీవితం-సాహిత్యం
మహారచయిత మక్సిం గోర్కి-జీవితం-సాహిత్యం
-వేల్పుల నారాయణ
ఓ కవి నువ్వు ఎటువైపు ప్రజలవైపా, పాలకులవైపా అనేది తేల్చుకో అంటూ ప్రభుత్వ నిరంకుశత్వంపై ప్రశ్నించే తత్వాన్ని చాటిచెప్పి రచయితలకు దిశానిర్ధేశం చేసి, జీవితపు అట్టడుగు లోతుల నుండి పైకి వచ్చి, ప్రపంచ సంస్కృతి, సాహితీ ఉన్నత శిఖరాలను అందుకున్న మహారచయిత మక్సిం గోర్కి.
ఒక రచయిత, ఒక రాజకీయ వేత్త, ఒక విప్లవకారుడు, ఒక సోషలిస్టు సమాజ దార్శనికుడు, ఒక మానవతా వాది ఇవన్నీ కలగలసి మూర్తీభవించిన గొప్ప రచయిత మక్సిం గోర్కి. ఒక మనిషి మీద మరో మనిషి పెత్తనాన్ని, దోపిడీని పూర్తిగా తొలగించి వేసే నూతన వ్యవస్థ సృష్టియే ధ్యేయంగా గల సమష్టి శ్రమను, రచయిత కవితాత్మకం చేయడంతో పాటు దోపిడీకి గురైన శ్రామికవర్గం పక్షాన రచయితగా నిలబడాలని చాటిచెబుతూ, సాహిత్యం మానవ పురోగతికి ఉపయోగపడాలని చెప్పిన మహనీయుడు గోర్కి. ఆయన సాహిత్యంలో మానవుడే కేంద్రబిందువు, మానవుడే విముక్తి ప్రధాత, మానవుడే మానవతావాది. ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎంతో ఆదర్శప్రాయం. ఆలోచనలను, ఆచరణలో పెట్టి చూపించిన, నిబద్ధతతో పాటు నిమగ్నత కలిగిన అసలైన శ్రామికవర్గ రచయిత. ఆయన అనుభవించిన జీవితం, పీడిరచబడే రష్యా ప్రజలు, శ్రామికవర్గం, వారు అనుభవించిన దుర్భరజీవితం, దాని నుండి విముక్తి కోసం సాగే తిరుగుబాట్లు, నిర్బంధాలు, జైలు జీవితాలు ఆయన సాహిత్య నేపధ్యం. అవన్నీ కూడా ఆయన అనుభవించాడు కాబట్టి రాటుదేలిన ఆచరణవాది అయ్యాడు. ఆ అనుభవాల నుండే సానతేలి అంతవరకు లేని సోషలిస్టు వాస్తవికతా వాదాన్ని సాహిత్యంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టి ప్రపంచ సాహిత్య గమనాన్నే మలుపుతిప్పాడు. అది ప్రపంచ రచయితలపై గొప్ప ప్రభావాన్ని చూపించింది. అందుకే గోర్కీ ప్రపంచ ప్రజల రచయిత కాగలిగాడు.
గోర్కి బాల్యం – సామాజిక నేపధ్యం
గోర్కి అసలు పేరు అలెగ్జీ మాక్సీమోవిచ్ పెష్కోవ్. గోర్కి అతని కలం పేరు. సంక్షిప్తంగా మక్సింగ్ గోర్కి పేరుతో రచయితగా ప్రసిద్ధికెక్కినాడు. మక్సింగ్ గోర్కి పెష్కోవ్, వర్ దంపతులకు 16`3`1868న నిజినీ పట్టణంలో జన్మించారు. తాగి తందనాలాడే తన తాత క్యాపిరిన్‌తో ఏగలేక గోర్కి తండ్రి, భార్యా బిడ్డలతో సహా నిజినీ పట్టణం వదిలి సుదూరంగా ఉన్న ఆస్ట్రాఖాన్ ప్రాంతానికి బ్రతకడానికి వలసవెళ్ళాడు. గోర్కి నాలుగు సంవత్సరాల వయస్సులోనే ఆయన తండ్రి కలరా వచ్చి 1871లో చనిపోయాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తల్లి వరియా గోర్కితో పాటు తిరిగి నిజీని పట్టణానికి చేరుకుంది. అక్కడ కూడా గోర్కి 12వ యేట 1879లో ఆయన తల్లి చనిపోయింది. తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే కొంతకాలం పెరిగాడు.
కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితుల్లో గోర్కి దుర్భరమైన జీవితం గడిపాడు. 12 యేండ్ల వయస్సులోనే బాల కార్మికుడిగా చెప్పుల దుకాణంలో చెప్పులు తుడిచేవాడిగా, హోటల్లో ప్లేట్లు కడిగేవాడుగా, పడవ కలాసిగా పనిచేశాడు. అమ్మమ్మ నుండి కూడా దూరమయ్యాక ఆయన పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. ఓడలో వంట వాడిగా పనిచేసిన స్మూరి అనే వ్యక్తి ఇచ్చిన మొట్టమొదటి పుస్తకం అండర్‌సన్‌లోని కథలు చదివాడు. ఆ కథలు అతనిపై ఎంతో ప్రభావం చూపించాయి. విద్యార్థుల నుండి, చిత్రకారుల నుండి, దుకాణదారుల నుండి పుస్తకాలు సేకరించి అనేకం చదివాడు. బాల్జోక్, ప్లాబర్ట్ కవితలు, పుష్కిన్, గోగోల్, తుర్గనివ్, లెర్మంటేవ్‌ల కథలు చదివి సాహిత్య అనుభవాన్ని, శైలిని, భావనలను ఏర్పరచుకున్నాడు. చహాక్ కథలు చదివిన తరువాత తనకు కూడా కథలు రాయాలనే అభిలాష ఏర్పడింది.
బతుకుదెరువు కోసం మురికికూపంగా ఉన్న నిజిని పట్టణాన్ని విడిచి ఖజాన్ ప్రాంతానికి చేరుకున్నాడు. నగర శివారులో ప్రచ్ఛన్న రాజకీయ గ్రూపులు, పోలీసులు, విప్లవకారులు, త్రాగుబోతులు, బికారీలు, విద్యార్థులు ఇలా రకరకాల గ్రూపుల్లో ఒకడుగా వారి మధ్య నివాసం ఏర్పరచుకున్నాడు.
అదే సమయంలో ఓడరేవులో 20 కోపేక్కులకు కూలీగా చేరాడు. విశ్వ విద్యాలయం నుండి తొలగించబడిన ఒక విద్యార్థి, ఏడేళ్లు ప్రజాసేవ చేసి గుడ్డలు ఏరుకుంటున్న ఒక రాజకీయవాది, గతంలో పశువైద్యుడైన ఒక బిక్షగాడు, ఒకప్పుడు గవర్నర్ వద్ద పనిచేసిన ఒక దేశ దిమ్మరి గోర్కికి సన్నిహితులయ్యారు. వారు ఒక దుకాణం నడుపుకునే దివాన్‌కో అనే విప్లవకారుడిని పరిచయం చేశారు. ఆ దుకాణంలోని నేల మాలిగలో దాచిన విప్లవ సాహిత్యం చదివి విశ్వ విద్యాలయంలో పొందలేనంత విప్లవ విజ్ఞానాన్ని అక్కడ పొందాడు. అప్పుడే మార్క్ ్స క్యాపిటల్ మొదటి భాగాన్ని చదివాడు. విప్లవ రహస్య సంఘాల్లో జరిగే చర్చల్లో పాల్గొనేవాడు. అక్కడి భూస్వాములు దివాన్‌కోవ్‌కు చెందిన దుకాణాన్ని తగలబెట్టడంతో గోర్కి అనివార్య పరిస్థితుల్లో పడవెక్కి అక్కడి నుండి ఆస్ట్రాఖాన్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడే కొంతకాలం పడవ లాగుతూ పొట్టనింపుకున్నాడు. అక్కడి నుండి చాలా కాలం తరువాత కాన్వియన్ ప్రాంతానికి చేరుకున్నాడు. 22వ యేట తిరిగి నిజిని పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుండి కాలినడకన డాన్ నదీ తీరం గుండా ఖజాన్ ప్రాంతం చేరుకున్నాడు. అక్కడ కోసక్కుల దేశంలో కొన్ని రోజులు ఉండి మాస్కోకు చేరుకున్నాడు. మార్గమధ్యంలో టాల్‌స్టాయి రచయితను చూడాలని ఆయన ఇంటికి వెళితే, ఆయన లేడు గానీ, ఆయన భార్య సోఫియా గోర్కిని ఇంట్లోకి తీసుకువెళ్లి ఫలహారం పెట్టి టాల్‌స్టాయ్‌ని చాడాలని వచ్చిన వారిలో ఎక్కువ మంది దేశదిమ్మరులే అని అవమానపర్చింది. అక్కడి నుండి తిరిగి నిజిని చేరుకొని విప్లవబృందాల్లో చేరి పనిచేశాడు. ఫలితంగా అతడు అరెస్టు చేయబడి నెల రోజుల తరువాత విడుదలయ్యాడు. నిజినీ లోనే ప్రముఖ రచయిత కోవెంకో, గోర్కిని వెన్నుతట్టి నీలో గొప్ప ప్రజ్ఞ ఉందని ఆశ రేకెత్తించాడు. అక్కడే ఓల్గా అనే వివాహిత యువతిని ప్రేమించాడు. భర్తను వదిలిపెట్టి తనతో రమ్మంటే ఆమె రావడానికి నిరాకరించింది. దాంతో ఆయన విరక్తి చెంది నిజినీ పట్టణాన్ని విడిచి రోస్ట్రావ్ ప్రాంతానికి వెళ్లి హార్బర్‌లో కొంతకాలం పనిచేశాడు. అక్కడి నుండి ఉక్రెయిన్ గుండా రుమేనియా సరిహద్దుల్లో ఉన్న డాక్యూట్ నదీతీరం వెంబడి దాదాపు రెండేళ్లు దేశాటన చేశాడు. ఉక్రెయిన్‌లో ‘‘కదం’’ అనే దురాచార సంఘటనను ఎదుర్కొంటే, జనాలు గోర్కిని తీవ్రంగా కొట్టి కొన ఊపిరితో వదిలేశారు. అక్కడి నుండి తార్ తార్ ప్రాంతం గుండా పోతున్నప్పుడు ప్లేగు వ్యాధి నివారణ చర్యలు లేకపోవడం వల్ల, ప్రజలు అందోళన చేస్తే కోసక్కు సైనికులు అనేక మంది ప్రజలను కాల్చిచంపారు. ఊరికి కొత్తగా కనబడ్డ గోర్కిని అనుమానంతో అరెస్టుచేసి సైనిక శిబిరంలో నిర్భందించారు. ఇది గోర్కి రెండవ జైలు జీవితం. ఈ భయానక జీవిత అనుభవాలు తాను సోషలిస్టు వాస్తవికత వాద రచయితగా మారడానికి దోహదపడ్డాయి. ఈ అనుభవాలన్నీ కూడా గోర్కి తన స్వీయ చరిత్ర మూడు భాగాల్లో పొందుపరిచాడు. 1896లో ఆగస్టు ఎకటేరినా ఒల్జినాతో గోర్కికి వివాహం జరిగింది.
గోర్కి మొదటి కథ
ఒక ఎరుకలవ్వ చెప్పిన ‘వీకాడ్‌బుద్ర’ అనే కథను వ్రాసి పత్రికకు పంపగా, అది అచ్చయింది. ఇది మక్సింగ్ గోర్కి పేరున అచ్చయిన మొట్టమొదటి కథ. దీనికి 30 రుబుల్ల పారితోషికం కూడా వచ్చింది. అప్పటి నుండి గోర్కి వ్రాసిన అనేక కథలు వివిధ పత్రికల్లో అచ్చయినాయి. కొరెంకోనవ్ సదస్కయ గెజటా అనే పత్రిక సంపాదకులు గోర్కిని ఆ పత్రికలో పనిచేయటానికి ఆహ్వానించాడు. ప్రతి ఆదివారం గోర్కి కథ ఆ పత్రికలో అచ్చయ్యేది. జనం విరగబడి చదివేవారు. ఒక సంవత్సర కాలంలోనే ఆయన ప్రముఖ రచయితల స్థానాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత నిజిని పట్టణంలో ఒక పత్రికా సంపాదకవర్గంలో చేరారు. నిజినిలో ఒక ప్రదర్శనశాల, అందులో పెట్టిన వివిధ వస్తువుల గురించి విరివిగా వ్రాస్తున్న వాళ్లు ఆ వస్తువులు తయారుచేసిన వారి స్థితిగతులను ఎందుకు రాయడం లేదని, ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విధంగా సోషలిస్టు వాస్తవికతను సాహిత్యంలో మొట్టమొదట తీసుకువచ్చిన ఘనత గోర్కిదే. అతని కాలంలోనే ఆయన సాహిత్యం గోర్కిని ప్రఖ్యాత రచయితలైన టాల్‌స్టాయ్, చెకోవ్‌ల సరసన నిలిపింది. దోపిడీ పట్ల రాజీలేని పోరాటం, మానవుని పట్ల అచంచల విశ్వాసం, గోర్కి సాహిత్యానికి మూలస్థంభాలుగా మారాయి. దీనివల్ల ప్రభుత్వానికి కన్నెర్ర కలిగి గోర్కిని నిజినీలో అరెస్టు చేసి టిప్లిన్ పట్టణం జైలులో పెట్టారు. విడుదలైన తర్వాత గోర్కి నిజిని పట్నం వచ్చి ఏ ఆధారం లేని వారి కోసం పెద్ద సత్రం కట్టించి వారిని అన్ని విధాల ఆదుకున్నారు. 1902లో శాస్త్ర వైజ్ఞానిక పరిషత్తుకు ఎన్నికైనప్పటికీ, ఆయన అనుభవించిన జైలు జీవితం కారణంగా పరిషత్తు నుండి ప్రభుత్వం ఆయనను బహిష్కరించింది.
తరువాత ప్రదర్శన కోసమని పండితామ్మాన్యులు, అగాధాలు నాటకాలను రాశాడు. ఆగాధాల ప్రదర్శన రోజున గోర్కి గౌరవార్ధం కార్మికులు పెద్ద ప్రదర్శన తీసి ఘనంగా సన్మానించారు.
గోర్కి, లెనిన్, అలెగ్జాండర్ బాగ్దెనవ్‌లతో, బోల్షివిక్ పార్టీతో సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉండేవాడు. 1905 జనవరి 9న మాస్కోలో జరిగిన విప్లవ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వానికి విన్నపం చేసుకోవడానికి వచ్చిన ప్రజలపై ప్రభుత్వం అమానుషంగా కాల్పులు జరిపి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ఇది ప్రభుత్వం కుట్రగా గోర్కి ప్రకటించారు. ఫలితంగా జనవరి 11న గోర్కిని అరెస్టు చేశారు. ఈ అరెస్టును ప్రపంచ దేశాలన్ని ఖండిరచిన ఫలితంగా ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది. విప్లవకారుల కోసం మాస్కోలో గోర్కి ఆయుధాలు సేకరించి తన ఇల్లునే ఆయుధాగారంగా మార్చాడు. వాటి కాపలాకోసం విద్యార్థులతో తుపాకిదళం ఏర్పాటు చేశాడు. గోర్కిపై వారెంట్ ఉండడం వల్ల స్నేహితుల హెచ్చరిక మేరకు జర్మనీకి వెళ్లి అక్కడి నుండి ఫ్రాన్స్ గుండా అమెరికాలోని న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడే ఆడిరోండల్స్ తోటలో మారుమూలనున్న ఓ గృహంలో ఉంటూ ప్రఖ్యాతి గాంచిన డాలర్ భూతం లాంటి అనేక కథలు రాశాడు. విశ్వ విఖ్యాతమైన అమ్మ విప్లవ నవలను 1906లో పూర్తిచేశాడు. దీనిని రష్యా జార్ ప్రభుత్వం నిషేధించింది. 1907 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో అమ్మ నవల విడుదలైంది. ఈ నవలలోని పావెల్, నిలోవా పాత్రలను బాగా తెలిసిన సోర్‌మోవో కార్మికుల నుండి ఎన్నుకున్నాడు. విప్లవ కార్యకలాపాల కోసం బోల్షివిక్ పార్టీకి ఇవాన్ నోరోడ్నితో కలిసి అమెరికాలో నిధులు సేకరించేందుకు గోర్కికి పార్టీ బాధ్యతలు అప్పగించింది.
1906`13 మధ్య కాలంలో రష్యా ప్రభుత్వం వారెంట్ జారీచేసిన ఫలితంగా గోర్కి అమెరికాను విడిచి ఇటలీలోని కాప్రీ ద్వీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలోనే గోర్కికి లెనిన్‌తో అత్యంత సన్నిహిత సంబంధం ఏర్పడింది. గోర్కి 1907లో లండన్‌లో జరిగిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ 5వ మహాసభలకు ఆహ్వానించబడి హాజరయ్యారు. ఆ సభల్లో బోల్షివిక్, మెన్షివిక్‌ల మధ్య జరిగిన సిద్ధాంత వైరుధ్యాల నేపధ్యంలో లెనిన్ ఇచ్చిన సిద్ధాంత ఉపన్యాసం గోర్కిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత లెనిన్ కాప్రీలో గోర్కితో కొంతకాలం కలిసి ఉన్నాడు. ఇద్దరు అక్కడే విప్లవ కార్యాచరణకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించుకున్నారు. ఈ కాలంలోనే గోర్కి బాగ్దానోవో, వ్లద్‌మీర్ బ్రిజ్నోవ్‌లు కలిసి ‘ఐడియా ఆఫ్ ఎన్‌సైక్లోపీడియా’ అనే రష్యన్ హిస్టరీ గ్రంథాన్ని తయారుచేశారు. 1913లో జార్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో రష్యాకు రమ్మని లెనిన్, గోర్కిని ఆహ్వానించడంతో ఆయన రష్యాకు వచ్చి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో స్థిరపడ్డాడు. 1917లో బోల్షివిక్ రష్యా విప్లవం సందర్భంగా గోర్కి పార్టీని అంటుపెట్టుకొని విస్తృతంగా పనిచేశాడు. తన పత్రిక న్యూలైఫ్ ద్వారా ఎప్పటికప్పుడు సవిమర్శనాత్మక కథనాలు రాసేవాడు. యుద్ధ సమయాల్లో ప్రచురించిన వ్యాసాలతో 1918లో అన్‌టైమ్‌లీ థాట్స్ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఇది కొంత వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే లెనిన్ యుద్ద నేరస్తులను అరెస్టు చేస్తూ క్రూరత్వం ప్రదర్శిస్తున్నాడని భావించి, వారందరికి వీలుంటే క్షమాబిక్ష పెట్టాలని కోరాడు. ఆయన మానవతా వాది కాబట్టి మానవత్వంపై అచంచల విశ్వాసంతోనే ఈ పని గోర్కి చేశాడు. లెనిన్‌కు గోర్కి ఎంత దగ్గరివాడైనా, ప్రభుత్వం మద్దతుదారుడైన రాజ్యం అనుసరించే కొన్ని ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇది రచయిత ప్రతిపక్ష పాత్రకు నిదర్శనం. 1921లో గోర్కికి సన్నిహితుడు, సహ రచయిత అయిన నికోలెగుమిలేవ్ యొక్క మోనార్కిస్ట్ విధానాల వల్ల అరెస్టు చేయబడితే, గోర్కి తీవ్రంగా స్పందించి అతన్ని వెంటనే విడుదల చేయాలని లెనిన్‌ను కోరాడు. అయితే లెనిన్ నుండి ఆదేశాలు తెచ్చే లోగానే అతను కాల్చివేయబడ్డాడు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 1921లో మౌరాబుడ్‌బెర్స్‌ను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడు. అనంతరం ఆమె అనధికారిక భార్యగా స్థిరపడింది. ఆ తరువాత అనారోగ్య కారణాల దృష్ట్యా లెనిన్ కోరిక మేరకు మంచి వైద్యం కోసం 1921లో ఇటలీలోని సొరెంటో పట్టణానికి వెళ్లాడు. అక్కడే 1921 నుండి 1928 వరకు జీవితం గడిపాడు. ఆ సమయంలోనే మక్సిం గోర్కి ‘పొలిటికల్ బయోగ్రఫి’ లాంటి అనేక మంచి పుస్తకాలు రాశాడు. సొరెంటోలో ఉన్నంతకాలం ఆయనకు ఎలాంటి ప్రఖ్యాతులు రాకపోగా, ఆర్థికంగా దెబ్బతిన్నాడు. ఈ కాలంలోనే ఆయన అనేకసార్లు రష్యాను సందర్శించాడు. 1932లో రష్యా దేశాధినేత జోసెఫ్ స్టాలిన్ వ్యక్తిగతంగా గోర్కిని రష్యాకు రమ్మని ఆహ్వానించడంతో రష్యాకు తిరిగివచ్చాడు. రష్యా ప్రభుత్వం ఆయనకు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డునిచ్చి ఎంతగానో సత్కరించింది. ఉండడానికి ప్రభుత్వపరంగా ఇల్లు కూడా కేటాయించింది. ఆ ఇంటినే గోర్కి మరణానంతరం గోర్కి మ్యూజియంగా మార్చారు.
స్టాలిన్ కార్మికవర్గ నియంతృత్వ కాలంలో 1934లో గోర్కిని కూడా హౌజ్ అరెస్టు చేశారు. 1934లో ఆయన కొడుకు మక్సిం పెష్కో ఆకస్మిక మరణం గోర్కిని ఎంతగానో కుంగదీసింది. దీంతో పాటు న్యుమోనియా వ్యాధి కూడా సోకడంతో 18 జూన్ 1936లో చనిపోయాడు. మహారచయిత మక్సిం గోర్కి మహాభిష్కరణంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల సాహిత్యం చిన్నబోయింది. ఆయన అంతిమయాత్రలో రష్యా అధినేత స్టాలిన్‌తో పాటు ములోటో కూడా పాల్గొని శవపేటిక మోసి నివాళులర్పించారు.
గోర్కి దాదాపు 50 పుస్తకాల వరకు రాశారు. అవి ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గాన్ని చైతన్యపరిచి వివిధ దేశాల్లో ప్రజలను విప్లవోన్ముఖులను చేశాయి. అందులో 33 నవలలు కథా సంపుటాలు కాగా, అందులో దాదాపు మరో 17 వరకు నాటికలు ఉన్నాయి. ఈ నాటికలు రష్యన్ ప్రజలను విప్లవ పథం వైపు నడిపించేందుకు వ్రాసి ప్రదర్శించబడ్డాయి. ఇవన్నీ కూడా మానవున్ని మహాసృష్టికర్తగా నిలిపే రచనలే.
మక్సిం గోర్కి నవలలు, కథా సంపుటాలు :
మేకార్‌చూద్రా 1892, గొర్రెమికాపావెల్ 1894, చెల్‌కాష్ 1895, మాల్వాషాట్ స్టోరీస్ 1897, స్కెచ్చెస్ Ê స్టోరీస్ త్రీ వ్యాల్యూమ్స్ 1898`99, క్రియేచస్ దట్ వన్స్ వర్ మెన్ 1905, 26 మ్యాన్ Ê గర్ల్స్ 1899, త్రి ఆఫ్ థీమ్ 1900, ది మధర్ 1907, లైఫ్ ఆఫ్ యూస్ లెస్ మ్యాన్ 1908, ఏ కన్‌ఫెషన్ 1908, ఒక్కరో సిటి 1908, ది లైఫ్ మాట్వి కొజేమియాకిన్ 1910, టేల్స్ ఆఫ్ ఇటలీ స్టోరీ 1911`13, మై చైల్డ్ హుడ్ ఆటో బయోగ్రాఫి పార్ట్ 1 1913`14, ఇన్ ద వరల్డ్ ఆటో బయోగ్రఫి పార్ట్ ` 2, 1916, చెలియాపిన్ ఆర్టికల్స్ ఇన్ లెటోపిస్ 1917, అన్‌టైమ్‌లీ థాట్స్ ఆర్టికల్స్ 1918, మై రీ కలెక్షన్స్ ఆఫ్ టోల్‌స్థో 1919, మై యూనివర్సిటీ ఆటో బయోగ్రఫి పార్ట్ ` 3, 1923, త్రో రష్యా, స్టోరీస్ 1923, ది ఆక్టమనౌ బిజినెస్ 1927, లైఫ్ ఆఫ్ క్లీమ్ సామ్‌జీన్, ది బైస్టాండర్ 1927, ది మ్యాడ్‌నెట్ 1928, ది ఫైర్స్ 1930, ది స్పెక్టర్ 1936, రిమెన్‌సెన్సెస్ ఆఫ్ టాల్ స్ట్రాయ్, చెకవ్ Ê ఆన్‌డ్రీవేవ్ 1920`28, విఐలెనిన్ రిమినిసెన్స్ 1924`31, ఐవి స్టాలిన్ వైట్ సి ` బాల్‌టిక్సి కెనాల్ 1934.
నాటకాలు :
ది స్మగ్ సిటిజన్ Ê ది పెటీబూర్జువా 1901, ది లోయర్ డెప్త్ 1902, సమ్మర్ ఫోక్ 1904, చిల్డ్రన్ ఆఫ్ ద సన్ 1905, బార్బేరియన్స్ 1905, ఎనీమీస్ 1906, ది లాస్ట్ వన్స్ 1908, ది రిసెప్షన్ 1910, ఊర్ పీపుల్స్ 1910, వాసా జెలీనోవా 1910, ది జికోవ్స్ 1913, కౌంటర్ ఫీట్ 1913, ది ఓల్డ్ మ్యాన్ 1915, వర్కా హెలిక్ స్లోవో టెకేవ్ 1920, సొమో Ê అదర్స్ 1930, యెగోర్ బుల్ప్‌చెవ్ Ê అదర్స్ 1932, దోస్తీగెవేవ్ Ê అదర్స్ 1933.
ఈ సాహిత్యంలో సోషలిస్టు వాస్తవికత వాదాన్ని, సోషలిస్టు మానవతా వాదాన్ని నింపి విప్లవ పోరాటాలను, విప్లవ కార్యాచరణను వేగవంతం చేయడానికి ప్రజల్ని సమర సైనికులుగా చేసిన గొప్ప రచనలను తన జీవిత కాలంలో గోర్కి ప్రపంచ ప్రజలకు అందించారు. శ్రామికవర్గం అజేయమైనది, తిరుగులేనిది, విజయం సాధించే శక్తి దానికుంది, ధర్మనిరతి, నైతికబలం కలది, గమ్యంలో విశ్వాసంలో కార్యాచరణలో పట్టుదల కలది అని చాటిచెప్పిన ప్రపంచం గర్వించదగిన మహారచయిత మక్సింగ్ గోర్కి.! (Story: గోర్కి-జీవితం-సాహిత్యం)
See Also : సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ
నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!
రష్యన్ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?
దుబాయ్‌లో రాజమౌళి ఏమన్నారంటే…!