రేపటి నుంచే మేడారం మహా జాతర ప్రారంభం
ములుగు : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిచెందిన మేడారం (Medaram) మహా జాతరకు రంగం సిద్ధమైంది. ఈ జాతరకు సర్వం సిద్ధం చేశామని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడిరచారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. జాతర నిర్వహణకు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ (KCR) సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను చేపట్టామని మంత్రి తెలిపారు. భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, అలాగే అన్ని రకాల కరోనా నిబంధనలను పాటించామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు 2500 కార్మికులు, 650 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని మంత్రి వెల్లడిరచారు.
తెలంగాణ (Relangana) రాష్ట్ర ఆవిర్భావం తరువాత సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెల్సిందే. అందుకనుగుణంగా గత ఎనిమిది ఏళ్లలో నాలుగు సార్లు జాతర నిర్వహణకు 381 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. జాతరకు రోడ్లు వేయడానికి, జాతరలో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనకు, జాతర నిర్వహణకు ఈ నిధులు వినియోగించారు. ఈసారి జాతరలో 10,000 మందికి పైగా పోలీసులు శాంతి భద్రతలను కాపాడడానికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అధునాతన సాంకేతికతతో కంట్రోల్ రూమ్ నుండి నిఘా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే జంపన్న వాగులోకి లక్నవరం నీటిని విడుదల చేశామని, వాగులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 6 వేల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. జాతరలో వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా మేడారంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మరో పది పడకలతో తాత్కాలిక ఆసుపత్రిని జాతర పరిసరాలలో 35 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. దీనికి తోడుగా 108, 104 లతో పాటు బైక్ అంబులెన్సులు కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.
జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం 3,840 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే సమ్మక్క, సారలమ్మ తల్లుల గద్దెల సమీపంలో వసతులు ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా హనుమకొండ నుంచి జాతరకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. దాదాపు 30 వేల మంది వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ జాతరను విజయవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయలకు అతీతంగా జాతర వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. (Story : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిచెందిన మేడారం మహా జాతరకు రంగం సిద్ధమైంది. )
See Also : కేసీఆర్‌తో మమత మాటామంతీ