బీజేపీ వెన్నుపోటుతో కళ్లు తెరిచాం : శివసేన
పనాజీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొట్టిన దెబ్బ అలా ఇలా లేదని శివసేన చెపుతోంది. బీజేపీ వెన్నుపోటుతో కళ్లు తెరిచామని శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే చెప్పారు. బీజేపీతో స్నేహం కారణంగా గోవాపై తాము ఇప్పటి వరకూ దృష్టి కేంద్రీకరించలేదని, తమకు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నామని, గోవాలో జరిగే భవిష్యత్ ఎన్నికల్లో తాము పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఆదిత్య థాక్రే శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘బీజేపీతో మితృత్వం కారణంగా శివసేన గతంలో గోవాపై దృష్టి కేంద్రీకరించలేదు. బీజేపీ మాకు వెన్నుపోటు పొడవటం, ఇతర రాజకీయ పరిణామాలను పరిశీలించిన తర్వాత గోవాలో భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పంచాయతీలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలన్నింటిలో మేము పోటీ చేస్తాం’ అని చెప్పారు. గోవాలో తమ పార్టీకి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలు శివసేన భవిష్యత్ కోసం కాదని, స్థానికులు, వారి భవిష్యత్ కోసమని ఆయన అన్నారు. గోవాలో ఇప్పటికీ నీటి సమస్య ఉందని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, ఈ రెండు సమస్యలను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తెలిపారు. అసలైన సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ, దాని నాయకులు సంబంధం లేని అంశాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సమాజంలో విభజన సృష్టించడం, విద్వేష ప్రసంగాలను ప్రస్తావిస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు పోటీ చేస్తామని థాక్రే తెలిపారు. గోవాకు శివసేన అవసరం చాలా ఉందని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ గోవాలో సుస్థిర అభివృద్ధి సాధించడంలో కాషాయపార్టీ వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. 2019లో మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీకి శివసేన గుడ్‌బై చెప్పింది. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో జత కట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవాలో ఎన్‌సీపీతో పొత్తుతో శివసేన పోటీ చేస్తోంది. ఫిబ్రవరి 14న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన పది సీట్లలో పోటీ చేస్తోంది. పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికిగాను మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసిన తన అభ్యర్థిని శివసేన ఉపసంహరించుకుంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఉత్పల్ పారికర్‌కు మద్దతుగా నిలిచింది. (story : బీజేపీ వెన్నుపోటుతో కళ్లు తెరిచాం : శివసేన)
బీజేపీ వెన్నుపోటుతో కళ్లు తెరిచాం : శివసేన
యువ క్రికెటర్లకు కాసులపంట
యువ క్రికెటర్లకు కాసులపంట
మెగావేలంలో ఇషాన్ కిషన్ సంచలనం
దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌లకు భారీ మొత్తాలు
అదరగొట్టిన హసరంగ, హర్షల్ పటేల్, పూరణ్, ఫెర్గూసన్, ప్రసిధ్‌కృష్ణ, రబడ
బెంగళూరు : భారత యువ క్రికెటర్లకు ఐపీఎల్‌లో కాసులపంట పండిరది. ముంబయి ఆటగాడు ఇషాన్ కిషన్ 15.25 కోట్ల రూపాయలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ రికార్డులను బద్దలుగొట్టాడు. దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ప్రసిధ్ కృష్ణలు అదరగొట్టారు. వీరిలో చాలామంది గతసారి కంటే భారీ మొత్తం సొంతం చేసుకోవడంతోపాటు పాత జట్లకే మరోసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్ రూ. 15.25 కోట్లతో అత్యధిక ధరను దక్కించుకున్నాడు. గత వేలంలో ఇషాన్‌కు రూ.6.20 కోట్లు దక్కాయి. ఈసారి భారీ ధర ఇచ్చి మరీ ఈ యువ బ్యాటర్‌ను ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబయి రిటెయిన్ చేసుకున్న ఆ జట్టు సారథి రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు) తర్వాత భారీ ధరను పొందిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ముంబయి రిటెయిన్ చేసుకున్న మిగతా ముగ్గురిలో బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు) కంటే ఇషాన్ కిషనే ఎక్కువ. అంతేకాకుండా వేలంలో యువరాజ్ (రూ.16 కోట్లు) తర్వాత భారీ ధరను దక్కించుకున్న టీమ్‌ఇండియా ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు.
దీపక్ చాహర్ చైన్నై సూపర్‌కింగ్స్ రిటెయిన్ చేసుకున్న అగ్రశ్రేణి క్రికెటర్ ఎంఎస్ ధోనీ కంటే అధిక మొత్తం సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసుకుంది. గత వేలంలో దీపక్‌కి దక్కింది కేవలం రూ. 80 లక్షలే. చెన్నై రిటెయిన్ చేసుకున్న ఎంఎస్ ధోనీకి ఇచ్చేది రూ. 12 కోట్లు. సీఎస్‌కేలో రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు) తర్వాత అత్యధిక విలువ కలిగిన ఆటగాడిగా దీపక్ చాహర్ రికార్డు సాధించాడు. దీపక్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీ పడిరది.
ఇక గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్ రేటు అదిరిపోయింది. అలానే లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకూ భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టే రూ. 10.75 కోట్లు చొప్పున సొంతం చేసుకుంది. నికోలస్ పూరన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇటీవల కాలంలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న వాషింగ్టన్ సుందర్‌ను హైదరాబాద్ రూ. 8.75 కోట్లకు దక్కించుకున్నది. మరో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లు పెట్టి కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16 కోట్లు), ప్యాట్ కమిన్స్(15.5 కోట్లు), కైలీ జెమీషన్(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.
బ్రిటన్‌లో బతుకు భారం!
బ్రిటన్‌లో బతుకు భారం!
లండన్ : బతుకు భారంగా సాగుతున్న దేశాల్లో బ్రిటన్ కూడా చేరింది. సంపన్నదేశాల్లో ఒకటైన బ్రిటన్‌లో ఇప్పుడు ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ధరలు పెరిగిపోయాయి. జీతాలు చాలడం లేదు. ఆర్థిక విధానాలతోపాటు కరోనా ఈ దేశ ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నది. దీంతో జనం వీధిపోరాటాలకు దిగుతున్నారు. శ్రామికులపై పన్ను పెంపును రద్దు చేయాలని, దాని స్థానంలో 1 శాతం సంపన్నులపై సంపద పన్ను విధించాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ దేశంలో పెరుగుతున్న జీవనవ్యయానికి వ్యతిరేకంగా వేలాదిమంది కార్మికులు, ప్రచారకులు బ్రిటన్‌లో ఉవ్వెత్తున ఉద్యమించారు. మెరుగైన ఉద్యోగాలు, జీవన పరిస్థితుల కోసం శనివారం బ్రిటన్ అంతటా నిరసన చేపట్టారు. సెంట్రల్ లండన్‌లో సాధారణ ఎన్నికలకు పిలుపునిస్తూ ‘‘ఎల్లో వెస్ట్’’ ఆధ్వర్వంలో ర్యాలీ జరిగింది. అబెర్డీన్ నుండి స్టోక్ వరకు దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. వీరికి ట్రేడ్ యూనియన్లు మద్దతు పలికారు. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఇప్పటికే 7.5 శాతం వద్ద నమోదవుతోంది. లండన్‌లో జరిగిన నిరసన – రివల్యూషనరీ సోషలిజం, డిసేబుల్డ్ పీపుల్ ఎగైనెస్ట్ కట్స్ (డీపీఏసీ), ఫ్యూయల్ పావర్టీ యాక్షన్ ఆధ్వర్వంలో నిర్వహించడమైంది. ప్రజలు నిరసనోద్యమంలో చేరాలని పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని జెరిమి కార్బిన్ పిలుపునిచ్చారు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి!
రోమ్‌లో 18వ డబ్ల్యుఎఫ్‌టీయూ మహాసభలు
ఏథెన్స్ : ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టీయూ) 18వ మహాసభలు మే 6-8 తేదీలలో ఇటలీలోని రోమ్‌లో జరుగనున్నాయి. సామ్రాజ్యవాద-పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని డబ్ల్యుఎఫ్‌టీయూ తాజా ప్రకటన పేర్కొంది. ఈ 18వ మహాసభలో తమ దేశాలు, ప్రాంతాలలోని శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ సవాళ్లను చర్చించడానికి ట్రేడ్ యూనియన్ నాయకులకు, కార్యకర్తలకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రజాస్వామ్య చర్చలు, అవలంబించే నిర్ణయాలు, కార్మికుల పోరాటాలకు, ట్రేడ్ యూనియన్ అభివృద్ధికి ఈ మహాసభలు కొత్త ఊపునిస్తాయని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా అమలవుతున్న పరిమితుల దృష్ట్యా ఈ సమావేశం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ప్రపంచ కార్మికవర్గ పోరాటాలు, లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా చారిత్రాత్మక 18వ ప్రపంచ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ను ఐక్యంగా విజయవంతం చేయాల్సిన అవసరం వుందని పేర్కొంది. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అనే నినాదంతో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టీయూ) ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తున్నది.
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి దాదాపు తెరపడిరది. సిఎం జగన్‌తో గురువారం సినీ ప్రముఖులు జరిపిన సమావేశం సత్ఫలితాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై సుమారు గంటకు పైగా సమావేశం జరిగింది. ముఖ్యంగా 17 అంశాలపై సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో చర్చించారు. ఎంపిక చేసిన కొన్ని చిత్రాలకు సబ్సిడీ, జీఎస్టీ మినహాయింపు, ప్రభుత్వ, చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అద్దె మినహాయింపు, ఆన్‌లైన్ టికెట్‌ల విక్రయం అమలు ఫిల్మ్ చాంబర్‌కు అప్పగించడం, చిన్న, మధ్య సినిమాలకు కూడా ఐదో షోకి అనుమతి, టాలీవుడ్ పరిశ్రమ హోదా ఇవ్వడం, ఏటా నంది అవార్డులు అందజేయడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు చార్జీల మినహాయింపు, విద్యుత్ సబ్సిడీ, థియేటర్లకు ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చర్చల అనంతరం మంత్రి పేర్ని నానితో సహా, సమావేశానికి హాజరైన నటులంతా మీడియాతో మాట్లాడారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ ‘‘ఇద్దరికీ నచ్చేలా సీఎం నిర్ణయం బాగుంది. సంతృప్తిగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. టికెట్ రేట్లు, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్‌సైజ్ చేశారు. ఓటీటీ, పైరసీ తదితర మాకున్న సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అందరికీ ఆమోదయోగ్యంగా వారం రోజుల్లో జోఓ వస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. మహేష్‌బాబు (Super Star Mahesh Babu)మాట్లాడుతూ, ‘‘కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. దీంతో రెండేళ్ల నుంచి తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ఈ తరహా చర్చలు వల్ల తొలగిపోయాయి. మా అందరికీ రెండేళ్లు చాలా కష్ట కాలం. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు’’ అని వ్యాఖ్యానించారు.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ, ‘‘సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఏర్పడిరదని ఇప్పటివరకు ఒక భ్రమ ఉండేది. ఈరోజు అది తొలగిపోయింది. సీఎం మాతో కలిసి నేరుగా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ఆర్.నారాయణ మూర్తి స్పందిస్తూ, ‘‘సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా… పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. హిట్ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా కూడా అలాంటి ఫలితాలు అనుభవించాలి’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, ఆలీ కూడా మాట్లాడారు.

ఏపీలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు
విజయవాడ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న 26 జిల్లాలు ఉగాది నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను విస్తృతం చేస్తున్నది. ఉగాది నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు కేంద్రంగా కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలకు సన్నాహకాలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదనల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని, వారికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని, పరిపాలన సాఫీగా సాగడానికి వారి అనుభవం దోహదపడుతుందని సీఎం చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగమంతా సమర్థవంతంగా పనిచేయాలని, ఆయా జిల్లాల్లో పని ప్రారంభమైన తర్వాత అయోమయం ఉండకూడదని, పాలన సాఫీగా ముందుకు సాగాలని కోరారు. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపుతో పాటు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. కొత్తగా మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేంత వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలు ఖరారు చేయాలని, అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలన్నారు. జిల్లాలకు సంబంధించి అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు నిశితంగా పరిశీలించాలని, నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడటం ముఖ్యమని, దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.జిల్లాపరిషత్‌ల విభజనకు అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.






