విజయవాడ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న 26 జిల్లాలు ఉగాది నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను విస్తృతం చేస్తున్నది. ఉగాది నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు కేంద్రంగా కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలకు సన్నాహకాలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదనల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని, వారికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని, పరిపాలన సాఫీగా సాగడానికి వారి అనుభవం దోహదపడుతుందని సీఎం చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగమంతా సమర్థవంతంగా పనిచేయాలని, ఆయా జిల్లాల్లో పని ప్రారంభమైన తర్వాత అయోమయం ఉండకూడదని, పాలన సాఫీగా ముందుకు సాగాలని కోరారు. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపుతో పాటు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. కొత్తగా మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేంత వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలు ఖరారు చేయాలని, అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలన్నారు. జిల్లాలకు సంబంధించి అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు నిశితంగా పరిశీలించాలని, నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడటం ముఖ్యమని, దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.జిల్లాపరిషత్‌ల విభజనకు అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.