బ్రిటన్‌లో బతుకు భారం!
లండన్ : బతుకు భారంగా సాగుతున్న దేశాల్లో బ్రిటన్ కూడా చేరింది. సంపన్నదేశాల్లో ఒకటైన బ్రిటన్‌లో ఇప్పుడు ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ధరలు పెరిగిపోయాయి. జీతాలు చాలడం లేదు. ఆర్థిక విధానాలతోపాటు కరోనా ఈ దేశ ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నది. దీంతో జనం వీధిపోరాటాలకు దిగుతున్నారు. శ్రామికులపై పన్ను పెంపును రద్దు చేయాలని, దాని స్థానంలో 1 శాతం సంపన్నులపై సంపద పన్ను విధించాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ దేశంలో పెరుగుతున్న జీవనవ్యయానికి వ్యతిరేకంగా వేలాదిమంది కార్మికులు, ప్రచారకులు బ్రిటన్‌లో ఉవ్వెత్తున ఉద్యమించారు. మెరుగైన ఉద్యోగాలు, జీవన పరిస్థితుల కోసం శనివారం బ్రిటన్ అంతటా నిరసన చేపట్టారు. సెంట్రల్ లండన్‌లో సాధారణ ఎన్నికలకు పిలుపునిస్తూ ‘‘ఎల్లో వెస్ట్’’ ఆధ్వర్వంలో ర్యాలీ జరిగింది. అబెర్డీన్ నుండి స్టోక్ వరకు దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. వీరికి ట్రేడ్ యూనియన్లు మద్దతు పలికారు. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఇప్పటికే 7.5 శాతం వద్ద నమోదవుతోంది. లండన్‌లో జరిగిన నిరసన – రివల్యూషనరీ సోషలిజం, డిసేబుల్డ్ పీపుల్ ఎగైనెస్ట్ కట్స్ (డీపీఏసీ), ఫ్యూయల్ పావర్టీ యాక్షన్ ఆధ్వర్వంలో నిర్వహించడమైంది. ప్రజలు నిరసనోద్యమంలో చేరాలని పెరుగుతున్న జీవన వ్యయాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని జెరిమి కార్బిన్ పిలుపునిచ్చారు.