హెల్మెట్ తో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని వాహనదారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రత చర్యల్లో భాగంగా. శనివారం విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు “హెల్మెట్ అవగాహన ర్యాలీ”గా పట్టణం ఆర్టిసి కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్ మీదుగా కొత్తపేట జంక్షన్, రింగు రోడ్డు మీదుగా తిరిగి ఆర్టీసి కాంప్లెకు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై, హెల్మెట్ అవగాహన ర్యాలీని, జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఆయన మాట్లాడుతూదిచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ప్రతి సంవత్సరం, ప్రతి నెలలో చాలామంది వాహనదారులు రహదారి ప్రమాదాలలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వలన రహదారి ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలపాలై, గోల్డెన్ అవర్స్ లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనాలు నడిపినపుడు ప్రతీ వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరిస్తే, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ చిన్న చిన్న గాయాలతో ప్రాణాలను రక్షించుకొనే పరిస్థితులు ఉంటాయన్నారు. హెల్మెట్ ధరించుట వలన కలిగే లబ్దిని వాహనదారులకు వివరించి, హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించి, ప్రతీ ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించే విధంగా చేయాలనే సంకల్పంతో జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందన్నారు. జిల్లాలో ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో ప్రజలకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీలు చేపడతామన్నారు. ముందుగా ప్రజలందరికి హెల్మ్ ధారణ పట్ల అవగాహన కల్పించి, వారిలో చైతన్యం వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తదనందరం, ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించని యెడల ఆ వాహనదారులపై ఎం.వి.నిబంధనలు ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకువస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యం కారణంగా వారి కుటుంబాలు వీధిన పడకూడదన్నారు. అతివేగం ప్రమాదకరమని, వేగంకన్నా సురక్షిత ప్రయాణం ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, ప్రమాదాల నివారణలో పోలీసు శాఖకు సహకరించాల్సిందిగా ప్రజలను కోరారు.ఈ అవగాహన కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు, ఎస్బి సిఐలు కే.కే.వి.విజయనా, ఎ.వి.లీలారావు, విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్, 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, మహిళా పిఎస్ సిఐ ఈ నర్సింహమూర్తి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఎన్.సి.సి. విద్యార్థులు మరియు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. (Story : హెల్మెట్ తో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి )