ఫలితాలుప్రకటించి టీచర్ల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్
న్యూస్తెలుగు/వనపర్తి : ప్రభుత్వం డీఎస్సీ ఫలితాలను వెంటనే ప్రకటించి టీచర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి కార్యాలయంలో మాట్లాడారు. జూన్ 12న పాఠశాలలు తెరిచారని, ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 11062 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం జూలై 18 నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు నిర్వహించారని ఫలితాలను మాత్రం ప్రకటించలేదన్నారు. సెప్టెంబర్ లో ఫలితాలు ప్రకటిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారని సెప్టెంబర్ నెల ముగియ వచ్చినా, ఫలితాలు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున డీఎస్సీని కొద్ది రోజులు వాయిదా వేయాలని అభ్యర్థులు వేడుకున్నా స్పందించని సర్కారు, ఇప్పుడు ఫలితాలను ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. ఫలితాలను ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగుల కలలు నెరవేర్చడంతో పాటు, పాఠశాలల్లో టీచర్లు లేక పిల్లలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలన్నారు. ప్రభుత్వం ఫలితాలను వెంటనే ప్రకటించకుంటే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ జిల్లా ఇన్చార్జ్ జే రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు విష్ణు, చందు పాల్గొన్నారు. (Story : ఫలితాలుప్రకటించి టీచర్ల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్)