తాత తరాలు మారినా ..భూపట్టాలు రాక..
తలరాతలు మారని గిరిజన లంబాడీల బ్రతుకులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా, గణపురం మండలం, కర్నే తండా, మామిడి మాడ తాండ ( ముందరి తండా ) వెనికి తాండ, మేడిబావి తాండ, బక్కతాండ మరియు మిట్యా తాండాలకు చెందిన 780 లంబాడి కుటుంబాలు 463 ఎకరాల భూములను తాత తరాల నుంచి సాగు చేస్తున్నా, నేటికీ భూములకు పట్టాలు లేవని తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. అజయ్ మరియు తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరాచారిల బృందం సోమవారంగిరిజనులు సాగు చేస్తున్న భూములను మరియు పై తాండాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శన సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలు ఏమంటే, గిరిజన తండాల చుట్టూ ఉన్న భూములను ఐదు తరాల నుంచి వారి వారసులు చెట్లు కొట్టుకొని 200 సంవత్సరాల నుంచి దాదాపుగా 463 ఎకరాల భూములను సాగు చేస్తూ ఉంటే, నాటి జాగీర్, జమీందారులూ, గిరిజనులు సాగు చేస్తున్న ఈ సారవంతమైన భూములపై కన్నేసి ఉంచి, దున్నే వాడికి భూ పట్టాలిచ్చేస్తున్న నాటి ప్రభుత్వ సందర్భాన్ని ఉపయోగించుకుని జాగిరిదారులే స్వయంగా సాగు చేస్తున్నట్లు గిరిజన భూములపై పట్టాలు పొందినారు. ఆ మధ్య కాలంలో సీలింగ్ చట్టాలూ, భూదానోద్యమం కార్యక్రమాలూ వచ్చినా, జాగీర్ దారు భూస్వాముల ఇద్దరి పేర్లపై ఉన్న 463 ఎకరాల సీలింగ్ చట్టాన్ని వర్తింప చెయ్యనివ్వకుండా, భూదానోద్యమ కార్యక్రమాన్ని కూడా దీనిపై కన్ను పడనివ్వకుండా, ప్రజా పాలన కింద ప్రజాప్రతినిధి వ్యవస్థ ఏర్పడినా, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కార్యక్రమాలు ఎన్నో వచ్చినా, గిరిజన హక్కుల చట్టాలు వచ్చినా నాటి నుంచి నేటి వరకు ఈ గిరిజన కుటుంబాలు సాగు చేస్తున్న 463 ఎకరాల భూములకు ఏ ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇవ్వలేదు అని అన్నారు. తాత తరాల నుంచి సాగులో ఉన్న ఈ గిరిజన లంబాడి కుటుంబాలకు భూపట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మరియు తెలంగాణ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
లేనియెడల గిరిజన లంబాడీలను పెద్ద ఎత్తున సమీకరించి భూపట్టాలు ఇచ్చేంతవరకు ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. (Story :తాత తరాలు మారినా ..భూపట్టాలు రాక..)