వ్యాట్ టాక్స్ విషయంలో వేధిస్తున్నారు
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం
న్యూస్‌తెలుగు/ విజయనగరం :
రాష్ట్రంలో ఏ జిల్లాల్లో లేని విధంగా జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులు విషయంలో కోట్ల రూపాయలు వ్యాట్ టాక్స్ చెల్లించాలని డిసిటిఓ వేధింపులకు గురి చేస్తున్నారని ఆర్టీసీ జిల్లా అద్దె బస్సుల సంఘం ప్రెసిడెంట్ జివి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-2015 లో 3.34 కోట్ల రూపాయలు టాక్స్ చెల్లించడం జరిగిందని, మరలా చెల్లించాలని అధికారులు చెప్పడంతో సంబంధిత అధికారులను వ్యాట్ విషయంలో కలవగా కమర్షియల్ అధికారులు ఆర్టీసీ వారు 5% వ్యాట్ చెల్లించాలని సూచించడంతో ఆర్టీసీ వారు ఆ మొత్తాన్ని చెల్లించారని తెలిపారు. ఇప్పుడేమో 14 శాతం వ్యాట్ టాక్స్ చెల్లించాలని కమర్షియల్ శాఖ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేశారని, ఆ డిమాండ్ నోటీసులు ఆధారంగా చేసుకుని అధికారులు తమ ఆస్తులను అటాచ్మెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మేము చెల్లించిన మూడు కోట్ల 34 లక్ష బిల్లులు అడిగితే లేవని డీసిటీఓ అధికారులు అంటున్నారని, మాగోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.వీరిని అడిగితే వాళ్లని, వాళ్లని అడిగితే వీరని సమాధానం చెబుతూ అద్దె బస్సులు యజమానులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వేధింపులు తట్టుకోలేక 250 అద్దె బస్సుల్లో సుమారు 45 బస్సులను నిలిపివేయడం జరిగిందని,ఈ విషయంపై సంబంధిత డీసిటీఓ కలిసేందుకు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో అద్దె బస్సు యజమానులు కొట్టుమిట్టాడుతున్నారని, రాష్ట్రంలో ఏ జిల్లాల్లో లేని విధానాలను ఈ జిల్లాలో ఎందుకు అధికారులు అమలు చేస్తున్నారని, ప్రభుత్వం కలుగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘం కార్యదర్శి రామకృష్ణ, ప్రేమ్ కుమార్, రత్న కిషోర్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. (Story : వ్యాట్ టాక్స్ విషయంలో వేధిస్తున్నారు)