ఫీజు జీరో అని రాకపోతే…డబ్బు కట్టాల్సిందే!
న్యూస్‌తెలుగు/అమరావతి: ఇంజినీరింగ్ ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌పై క్లారిటీ వచ్చింది. దానికన్నా ముందు, ఏపీ ఈఏపీసెట్ (2024) ఇంజినీరింగ్ తొలి విడత 1,17,136 సీట్లను భర్తీ చేయనున్నారు. ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు ఖరారు అయిన వారికి వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్ లెటర్లను అందుబాటులో ఉంచారు. ఈనెల 16న ఇంజినీరింగ్ సీట్లను ప్రకటించాల్సి ఉండగా… సాంకేతిక సమస్యల కారణంగా ఒక రోజు ఆలస్యంతో విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 22వ తేదీలోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్‌లైన్ రిపోర్టింగ్‌తో పాటు వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే వచ్చిన సీటు రద్దవుతుంది. ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు పొందిన సీట్లను సంబంధిత కళాశాలలో సహా అందుబాటులో ఉంచారు. అలాట్‌మెంట్ లెటర్‌లో ఫీజు జీరో అని వచ్చిన వారికి మాత్రమే పూర్తిగా ఫీజులో రాయితీ ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉండి, ఫీజు జీరో అని రాని వారంతా సమీప హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి ఆదాయ, రేషన్ కార్డు పత్రాలతో సరిచేయించుకోవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని వారంతా కన్వీనర్ కోటా కింద నిర్దేశించిన ఫీజును సంబంధిత కళాశాలలో చెల్లించాల్సి ఉంటుంది. (Story: ఫీజు జీరో అని రాకపోతే..డబ్బు కట్టాల్సిందే!)