కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు
విజయనగరం జిల్లా వ్యాప్తంగా 28,490 వేల యాంటీ రేబీస్ టీకాలు సిద్ధం చేసిన పశు సంవర్ధక శాఖ
న్యూస్ తెలుగు/విజయనగరం: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జులై నేడు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేయనున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. వై విరమణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్యశాలలో, ప్రాంతీయ పశు వైద్య శాలలో, వెటర్నరీ పోలి క్లినిక్స్ వద్ద ఉచితంగా టీకాలు వేయడానికి శనివారం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 28,490 యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1962 ను లేదా దగ్గర్లోని పశువైద్యశాలలో గానీ, సమీప రైతు సేవా కేంద్రంలో గాని సంప్రదించాలని పశువుల పెంపకం దారులకు, రైతులకు, ప్రజలకు, పశువైద్యులకు సూచించారు. మనుషుల నుండి పశువులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల ఆధారంగా, ప్రముఖ శాస్త్ర వేత్త లూయిస్ పాశ్చర్ కుక్కకాటు బారిన పడిన ఒక పిల్లవాడికి టీకా మందు ఇచ్చి బ్రతికించిన రోజు ఇదే కావడం వలన జూలై 6న ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటామని వివరించారు. సుమారు 180 రకాలకు పైబడిన వ్యాధులు పశుపక్ష్యాదుల నుండి మనుషులకు సంక్రమిస్తాయని పేర్కొన్నారు. ఈ జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి, జూనోటిక్ రోగాల బారిన పడకుండా చేయడమే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.పశుపక్ష్యాదులతో మెలిగే పశువైద్యులు, రైతులు, వధశాల కార్మికులకు, పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండే వారికి ఎక్కువగా ఈ వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. ప్రధానంగా వీరికి రేబిస్, ఆంత్రాక్స్, బ్రుసుల్లోసిస్, క్లయ మొదలైన వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. ఇందులో రేబిస్ చాలా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిపారు. జూనోసీస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. పశువుల పెంపకం దారులు, రైతులు, ప్రజలు జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంచుకొని తగిన నివారణ చర్యలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. (Story: కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు)