UA-35385725-1 UA-35385725-1

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూదిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 307 రద్దుని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. వీలైనంత త్వరగా రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని, అలాగే వచ్చే ఏడాది సెప్టెంబరు 30 నాటికల్లా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. జమ్మూ కశ్మర్‌ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని, కేంద్రం తీసుకునే ప్రతి చర్యనూ సవాలు చేయకూడదని సీజేఐ అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి కేంద్రానికి రాష్ట్రం అనుమతి అవసరం లేదని జస్టిస్‌ చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్య చేశారు. జమ్మూ, కాశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచించారు. 1947లో ఏర్పడిన భారత యూనియన్‌లో విలీనం చేస్తూ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేత ప్రతిపత్తిని 370 అధికరణ కల్పించింది. దీని వల్ల వివిధ రాజ్యాంగ పథకాలు వర్తిస్తాయి. అయితే, వీటన్నింటినీ రద్దుచేయడాన్ని సమర్థిస్తూ మూడు ఏకరూప నిర్ణయాలతో కూడిన తీర్పును జస్టిస్‌ చంద్రచూడ్‌ వెలువరించారు. రాజ్యాంగ ధర్మాసనం మూడు తీర్పులను వెల్లడిరచింది. ఇందులో జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లు ఒక తీర్పును, జస్టిస్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు వేర్వేరుగా రెండు తీర్పులను వెలువరించారు. ఈ మూడు తీర్పులూ 370 అధికరణ రద్దును సమర్ధిస్తూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యాంగ ధర్మాసనం సంపూర్ణంగా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లయింది. 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌ నుంచి లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. అంతేగాకుండా, అదే రోజు కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ల పేర్లతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను విభజించింది.
భారత యూనియన్‌లో చేరినప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని, భారత రాజ్యాంగంలోని ప్రతి నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టంచేశారు. ‘‘ఆర్టికల్‌ 370 తాత్కాలిక నిబంధన. రాష్ట్రంలో యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్‌ కూడా అన్ని రాష్ట్రాల లాంటిదే. ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా అంతర్గత సార్వభౌమాధికారం లేదు. ఈ మేరకు రాజ్యాంగంలో కూడా ప్రస్తావన లేదు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్‌వ్యవస్థీకరించడం సమర్థనీయం. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా? లేదా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఆ పని కేంద్రం చేసుకుంటుంది. ఆర్టికల్‌ 370 రద్దు సరైనదే. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు సమర్థనీయమే. ఆర్టికల్‌ 370 ముఖ్య ఉద్దేశ్యం జమ్మూకశ్మీర్‌ను నెమ్మదిగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావడమే. డొంక దారిలో నిబంధనల సవరణ సరికాదు. ఒక విధానాన్ని సూచించినప్పుడు దానిని తప్పకుండా అనుసరించాలి’’ అని సీజేఐ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 367 ఉపయోగించి ఆర్టికల్‌ 370 సవరణ ప్రక్రియ చేపట్టడంపై జస్టిస్‌ కౌల్‌ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ‘నిష్పాక్షిక నిజం, సయోధ్య కమిటీ’ని ఏర్పాటు చేయాలని, ఈ అంశంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్‌ కౌల్‌ సిఫార్సు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. కశ్మీర్‌ రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2024 సెప్టెంబర్‌ 30కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఇదిలావుండగా తీర్పు నేపథ్యంలో కశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ కోరింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా జమ్ము-కశ్మీర్‌ పార్టీలు ఏర్పడ్డాయి. గుప్కార్‌ అలయన్స్‌ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 2 నుంచి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలు జమ్ము-కాశ్మీర్‌ రాజకీయ పార్టీలు సుప్రీంను ఆశ్రయించాయి.
సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం: ప్రధాని మోదీ
ఆర్టికల్‌ 370 రద్దుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ‘ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దృఢమైన విశ్వాసం కలిగిన జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌ ప్రజల కలలను సాకారానికి కట్టుబడి ఉన్నామని మోదీ హామీ ఇచ్చారు. ప్రగతి ఫలాలను సాధారణ ప్రజలతోపాటు సమాజంలో అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు అందజేస్తామన్నారు. ఆర్టికల్‌ 370 కారణంగా నష్టపోయిన సమాజానికి అభివృద్ధి ఫలాలను అందజేస్తామని తెలిపారు. ఈ తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు కాదని, ఇదొక ఒక ఆశాకిరణంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, ఉమ్మడి భారతదేశాన్ని నిర్మించాలనే సమష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (Story: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు)
See Also:

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? హిందూ వ‌నిత‌కు నుదుట తిల‌కం త‌ప్ప‌దా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1